Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. 2021 లో ఆయన హైదరాబాద్ లో ఆయన బైక్ యాక్సిడెంట్ కు గురయ్యారు. దీంతో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజులు విరామం తర్వాత ఆయన మళ్లీ ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 21 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు యాక్సిడెంట్ సమయంలో జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.
అతనికి నా నెంబర్ ఇచ్చి ఏ హెల్ప్ కావాలన్నా కాల్ చేయమని చెప్పాను: సాయి ధరమ్ తేజ్
తాను యాక్సిడెంట్ కు గురైనప్పుడు ఆ సమయంలో పక్కనే ఉన్న అబ్దుల్ సయ్యద్ అనే వ్యక్తి చూసి వెంటనే స్పందించాడని అన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారని చెప్పారు. అందుకే తర్వాత అబ్దుల్ సయ్యద్ ను వెతికి థ్యాంక్స్ చెప్పానని అన్నారు. అలాంటి కష్ట సమయంలో మానవత్వంతో స్పందించి తనకు సాయం చేసిన అతనికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే తన ఫోన్ నెంబర్ ను అబ్దుల్ కు ఇచ్చి ఎలాంటి అవసరం ఉన్నా ఫోన్ చేయమని చెప్పానని తెలిపారు. ఇప్పటికీ అతను తనతో టచ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో వాళ్ల క్రియేటివిటీ చూసి నవ్వొచ్చేది..
తాను యాక్సిడెంట్ కు గురైనపుడు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు రకరకాలుగా వార్తలు రాశారని అన్నారు. చాలా మంది తాను మందు తాగానని, డ్రగ్స్ తీసుకున్నానని రాశారని కానీ తనకు అలాంటి అలవాట్లు లేవని చెప్పారు. తాను ఎలా ఉంటాను అనేది తన ఇంట్లో, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తెలుసని అన్నారు. ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియకుండా పబ్ కు వెళ్తున్నాడు అని వార్తల్లో రాసేశారని, కానీ తాను ఆ రోజు దేవ కట్టా ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్తున్నానని చెప్పారు. ఆ సమయంలో వాళ్ల క్రియేటివిటీ చూసి నవ్వొచ్చేదని చెప్పుకొచ్చారు.
బైక్ రైడింగ్ అంటే ఇష్టం, హెల్మెట్ నన్ను కాపాడింది..
తనకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని అన్నారు సాయి ధరమ్ తేజ్. కార్ లు నడపడం కంటే బైక్ రైడ్ కే ఎక్కువ వెళ్తానని చెప్పారు. అందుకే ఆ రోజు కూడా బైక్ మీద వెళ్లానని చెప్పుకొచ్చారు. బైక్ డ్రైవ్ చేస్తే ఆ కిక్ బాగుంటుందని కానీ అన్ని జాగ్రత్తలు తీసుకునే బైక్ ను డ్రైవ్ చేయాలని సూచించారు. తన విషయంలో కూడా హెల్మెట్ ఉండబట్టే తనకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ బైక్ నడిపేటపుడు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు.
Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?