హిట్ సిరీస్‌లో ప్రతి సంవత్సరం ఒకే తేదీ లేదా ఒకే వారంలో ఒక సినిమా విడుదల కావాలని, ఆ సీజన్ హిట్ సిరీస్‌కే సొంతం అవ్వాలని ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ‘హిట్: ది సెకండ్ కేస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అలాగే ఒక సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీని తయారు చేసినందుకు ప్రశాంతి, నాని, శైలేష్‌లను అభినందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
‘హిట్ అనేదాన్ని ఒక సినిమాలా కాకుండా ఫ్రాంచైజీలా తయారు చేసిన ప్రశాంతి, నాని, శైలేష్‌లకి కంగ్రాట్యులేషన్స్. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీని తయారు చేయడం చాలా కష్టం. ఈ జానర్‌లో మనదేశంలో ఇంతవరకు ఫ్రాంచైజీ లేదు. హిట్ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం చాలా సంతోషం. హిట్ సిరీస్‌లో ఏ హీరో ఉన్నా సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారు. అలాంటి ఫ్రాంచైజీ క్రియేట్ చేసినందుకు వారికి అభినందనలు.’
‘హిట్ 1లో విష్వక్ సేన్, హిట్ 2లో చేసిన అడివి శేష్ ఈ ఫ్రాంచైజీకి చాలా ఎనర్జీ తీసుకువచ్చారు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్‌లో నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. హీరోకి, విలన్ చాలెంజ్ చేయడం నాకు బాగా నచ్చింది. దీన్ని చేసింది ఎవరో చూడాలనే ఆసక్తి నాలో కలిగింది. ఈ ఉత్సుకత కలిగించడం థ్రిల్లర్‌కు చాలా ముఖ్యం. శైలేష్ అందులో సక్సెస్ అయ్యాడు.’
‘హిట్ 3, హిట్ 4, హిట్ 5 ఇలా వస్తూనే ఉంటాయి. కానీ అవి ప్రతి సంవత్సరం ఒకే సీజన్‌లో రావాలి. ఆ సీజన్ హిట్‌కే సొంతం అని జనాలకు అర్థం కావాలి. ప్రతి సంవత్సరం ఒకే తేదీన లేదా ఒకే వారంలో హిట్ సిరీస్‌లో నుంచి ఒక సినిమా రావాలి. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు అది చేస్తారని అనుకుంటున్నాను.’
’సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నటులందరూ బాగా నటించారు. స్క్రీన్‌పై అడివి శేష్, మీనాక్షి జంట బాగుంది. శ్రీలేఖ చేసిన ఉరికే ఉరికే పాట, పోరాటమే పాట చాలా బాగా వచ్చాయి. తెలుగు సినిమా అందించే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇది. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లో కలుద్దాం.’ అంటూ ముగించారు.
ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని యాంకర్ సుమ అడగ్గా... ‘అవన్నీ తెలీదు కానీ దాని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం మీరే యాంకర్.’ అన్నారు.