అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17వ తేదీన విడుదల అయింది. ఇప్పుడు రష్యాలో పుష్పరాజ్ సందడికి రంగం సిద్ధం అవుతుంది. డిసెంబర్ 8వ తేదీన రష్యాలో ‘పుష్ప: ది రైజ్’ విడుదల కానుంది. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ కూడా జపాన్‌లో విడుదలై భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప కూడా హిట్టయితే తెలుగు సినిమా ప్రపంచంలోని వివిధ దేశాల్లో జెండా పాతేసినట్లు అవుతుంది.


'పుష్ప 2' (Pushpa 2 The Rule) షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. క్రిస్మస్ సీజన్ కంటే ఓ వారం ముందు పుష్ప థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా రావాలని అల్లు అర్జున్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట. ఈసారి 'పుష్ప 2'ను క్రిస్మస్ వీకెండ్ థియేటర్లలోకి తీసుకు వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది (2023) డిసెంబర్ లో 'పుష్ప 2' విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. 
 
బ్యాంకాక్‌లో రెండు వారాలు 
'పుష్ప 2' షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించడంతో రెండు పార్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేశారు. అది కంప్లీట్ కావడంతో వచ్చే వారం సెట్స్ మీదకు వెళుతున్నారు. బ్యాంకాక్‌లో రెండు వారాలు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ అడవుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆల్రెడీ దర్శకుడు సుకుమార్ బ్యాంకాక్ వెళ్లారని తెలిసింది. 30 శాతం సినిమా బ్యాంకాక్ అడవుల్లో షూటింగ్ చేయనున్నారు. ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన అల్లు అర్జున్, అక్కడ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళతారట. అదీ ప్లాన్!


బడ్జెట్ ఎంతైనా పర్లేదు!
'ఊర్వశివో రాక్షసివో' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ''ఇప్పుడు నన్ను అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తా... 'పుష్ప 1' తగ్గేదే లే అయితే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. నేనూ ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను'' అని బన్నీ చెప్పారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట. 


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ 'పుష్ప 2' ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'పుష్ప' నిర్మాతలు కూడా వారే. 'పుష్ప' కంటే ముందు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' నిర్మించారు. వాళ్ళకు దర్శకుడితో మంచి గురి కుదిరింది. 'పుష్ప 2' మీద భారీ అంచనాలు ఉండటంతో ఖర్చు విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. 


అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా...  ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. 'తగ్గేదే లే'తో పాటు 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. అందులో సమంత (Samantha)తో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు సిగ్నేచర్ మూమెంట్స్ అయ్యాయి. చాలా షోల్లో కాపీ చేస్తున్నారు. మరి, 'పుష్ప 2' కోసం దేవి శ్రీ ప్రసాద్ ఎటువంటి ఐటమ్ సాంగ్ కంపోజ్ చేస్తారో? అని అందరూ వెయిట్ చేస్తున్నారు.