Bubblegum OTT Release Date: ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన చిత్రం 'బబుల్‌గమ్'. ఇందులో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 2023 డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజే యావరేజ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ మూవీ రిలీజైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తుందటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన 'బబుల్‌గమ్' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తవడంతో మూడు వారాలు తిరక్కుండానే స్ట్రీమింగ్ కు రెడీ అవుతోందని అంటున్నారు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటుగా రిలీజ్ డేట్ ను వెల్లడించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
నిజానికి 'బబుల్‌గమ్' సినిమా కోసం, తనయుడిని హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడానికి సుమ చాలా కష్టపడింది. రోషన్ తో కలిసి చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ చేసింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, అడివి శేష్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులను ప్రమోషన్స్‌లో భాగం చేసింది. అయితే ఇవేవీ సినిమాని నిలబెట్టలేకపోయాయి. కంటెంట్ లో బలం లేకపోవడం, కొత్తదనం మిస్సవ్వడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. దీనికి తోడు అప్పటికే 'సలార్' సినిమా బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తుండటంతో, ప్రభాస్ మేనియాలో కొట్టుకుపోయింది. దాదాపు 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2 కోట్ల లోపే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: హాలీవుడ్ హీరోలను తలదన్నేలా సోగ్గాడి స్టైలిష్ లుక్ - ఆర్జీవీ వీడియో వైరల్!
'బబుల్‌గమ్' మూవీ ప్లాప్ అయినా హీరోగా రోషన్ కనకాలకి మాత్రం మంచి గుర్తింపే దక్కింది. హీరోయిన్ మానస చౌదరి - రోషన్ మధ్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలు యూత్ ని అట్రాక్ట్ చేసాయి. అందుకే ఈ సినిమాకి ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ దక్కే అవకాశం ఉంది. థియేటర్లో చూడని జనాలు ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నారు.
'క్షణం' 'కృష్ణ అండ్ హిజ్ లీలా' ఫేమ్ రవికాంత్ పేరేపు 'బబుల్‌గమ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో రోషన్ కనకాల - మానస చౌదరిలతో పాటుగా హర్షవర్ధన్, హర్ష చెముడు, మిర్చి కిరణ్, అనన్య ఆకుల, అను హాసన్, జైరామ్ ఈశ్వర్, బిందు చంద్రమౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రోషన్ తండ్రి పాత్రలో హీరో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ నటించడం గమనార్హం.
Also Read: ‘కంగువ’ అప్డేట్.. సమ్మర్ వార్ కి సన్నద్ధం అవుతున్న సూర్య!