Artificial intelligence created Sobhan Babu: తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న నటుడు దివంగత శోభన్ బాబు. తనదైన అభినయం, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలనాటి అమ్మాయిల కలలు రాకుమారుడిగా, సోగ్గాడుగా గుర్తుండిపోయారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా, సినిమాల రూపంలో సజీవంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి దిగ్గజ నటుడు యంగ్ ఏజ్ లో ఉన్న ఓ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవి రియల్ అనుకుంటే పొరపాటే అవుతుంది. అవన్నీ ప్రెజెంట్ మనకు అందుబాటులో ఉన్న ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సృష్టించబడ్డాయి.
ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఉపయోగించి ఎలాంటి కష్టమైన పనులనైనా చాలా సునాయాసంగా చేసేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మనం ఇంతవరకూ చూడని వ్యక్తులను, దేవుళ్లను సృష్టిస్తున్నారు. ఫోటోలు వీడియోలను రీ క్రియేట్ చేయడమే కాదు, మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. దీని వల్ల ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా ఉంది. ఇటీవల ఏఐ జనరేటెడ్ ఫోటోలతో పలువురు సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూశాం. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు కృత్రిమ మేథస్సుతో దివంగత శోభన్ బాబును సృష్టించారు.
'ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన శోభన్ బాబు' అంటూ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ ఎక్స్ లో ఓ వీడియోని షేర్ చేసారు. ఇందులో సోగ్గాడు శోభన్ బాబు మోడరన్ లుక్ లో, సిక్స్ ప్యాక్ బాడీతో బీచ్ ఒడ్డున అలా స్లో మోషన్‌లో నడుచుకుంటూ వస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతున్న 'గోరింటాకు' సినిమాలోని 'కొమ్మ కొమ్మకో సన్నాయి' పాట ఈ వీడియోకి అదనపు ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటుగా ఏఐ జనరేట్ చేసిన మరికొన్ని వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు సోగ్గాడు హాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరం అమ్మాయిలు కూడా ప్రేమలో పడిపోతారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక లెజండరీ శోభన్ బాబు సినీ ప్రస్థానం విషయానికొస్తే.. 1959లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన 1996 వరకు సినిమాల్లో కొనసాగారు. దాదాపు 230కి పైగా సినిమాల్లో నటించి, మూడున్నర దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా, సోగ్గాడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు ధీటుగా నిలబడ్డారు. కెరీర్ చివరి వరకూ లీడ్ రోల్స్ లోనే నటిస్తూ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన హీరోగా నిలిచిపోయారు.
వివాదాలకు దూరంగా ఉండే ఆయన, ఎలా జీవించాలి అనుకున్నాడో అలానే జీవించాడు. ఎలాంటి సమస్యలూ, బాధలూ, చికాకులు లేని చాలా ప్రశాంతమైన జీవితం గడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే తన తాత, తండ్రి మాదిరిగానే 100 ఏళ్ళు బ్రతుకుతాను అని చెబుతూ వచ్చిన శోభన్ బాబు.. తన 71వ ఏట కన్నుమూశారు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఆనాటి సోగ్గాడు మళ్ళీ జన్మించాడు.
Also Read: కీర్తి సురేష్ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా?