మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'ఈగల్'. ఇందులో ఆయన జోడీగా కావ్య థాపర్ నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కావ్య థాపర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... 


ముంబైలో హిందీ సినిమా షూటింగ్ చేస్తుండగా...
''నేను ముంబైలో ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నా. అప్పుడు కార్తీక్ ఘట్టమనేని కథ చెబుతారని ఫోన్ వచ్చింది. చిత్రీకరణ పూర్తయ్యాక రాత్రి 9.30 గంటలకు వెళ్లా. అప్పుడు కథ చెప్పడం మొదలు పెట్టారు. నాకు విపరీతంగా నచ్చింది. కథ కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా చేయాలనుకున్నా. పైగా, ఈ సినిమాలో రవితేజ గారు హీరో. వెంటనే ఓకే చేశా. అయితే... లుక్ టెస్ట్ చేయాలని చెప్పారు. హైదరాబాద్ వచ్చా. నా లుక్ టెస్ట్ చేసేటప్పుడు రవితేజ గారు వచ్చారు. ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ, వచ్చారు. అదీ ఆయన గొప్పతనం'' అని కావ్య థాపర్ చెప్పారు. 


రొమాన్స్, సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి!
''ఈ సినిమాలో నా పాత్ర పేరు రచన. జీవితంలో ఆ అమ్మాయికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అలాగే, హీరోతో అద్భుతమైన ప్రేమ కథ ఉంది. దాని గురించి ఇప్పుడు ఎక్కువ రివీల్ చేయకూడదు. హీరో హీరోయిన్ల మధ్య యూనిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆ రొమాన్స్, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి'' అని కావ్య థాపర్ వివరించారు. 


రవితేజతో అటువంటి సాంగ్ చేసే అవకాశం రాలేదు!
''రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. ఆయన వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. ఎప్పుడూ చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సరదా, సపోర్టివ్ పర్సన్. ఈ సినిమాలో ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. అయితే... మా మధ్య మాస్ ఎనర్జిటిక్ సాంగ్ లేదు. మొదట అటువంటి సాంగ్ ప్లాన్ చేశాం. కానీ, కథలో భాగంగా వెళ్లడం లేదని పక్కన పెట్టేశాం'' అని కావ్య థాపర్ వివరించారు.


రవితేజతో మళ్లీ సినిమా చేసే అవకాశం వస్తుందని, అప్పుడు తప్పకుండా మాస్ ఎనర్జిటిక్ సాంగ్ చేస్తానని కావ్య థాపర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రవితేజతో మళ్లీ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.


రచయిత మణి ప్రశంసలు మరువలేను!
'ఈగల్' సినిమా విడుదలకు ముందు వచ్చిన ఒక ప్రశంసను తాను ఎప్పటికీ మరువలేనని కావ్య థాపర్ చెప్పారు. దాని గురించి ఆమె మాట్లాడుతూ ''రచయిత మణి గారు 'అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కనిపించలేదు. రచన మాత్రమే  కనిపించింది' అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా సంతృప్తి ఇచ్చింది'' అని చెప్పారు.


Also Read: గోపీచంద్ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్


'ఈగల్' సినిమా చిత్రీకరణ అంతా అందమైన ప్రయాణంలా సాగిందని కావ్య థాపర్ తెలిపారు. ''పోలాండ్, లండన్... ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్లలో ఇంటర్ నేషనల్ స్థాయిలో సినిమా చిత్రీకరణ చేశారు. అంతా ఒక వెకేషన్ తరహాలో అనిపించింది. చాలా ఎంజాయ్ చేశా'' అని ఆమె వివరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సంస్థలో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని కావ్య థాపర్ చెప్పారు. ఆమెకు ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని ఉందట.


Also Read: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో ఓజీ కొత్త పోస్టర్