RJ Balaji: 'అందుకే మూకుత్తి అమ్మన్ 2 డైరెక్ట్ చేయడం లేదు' - నయనతార సీక్వెల్ మూవీపై ఎట్టకేలకు మౌనం వీడిన దర్శకుడు ఆర్జే బాలాజీ
Mookuthi Amman 2: నయనతార లేటెస్ట్ మూవీ 'మూకుత్తి అమ్మన్ 2'కు దర్శకత్వం వహించకపోవడంపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించి తన ప్రణాళికలు వేరుగా ఉన్నట్లు చెప్పారు.
RJ Balaji Revealed Why He Is Not Directing Nayanthara's Mookuthi Amman 2: ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేటెస్ట్ మూవీ 'మూకుత్తి అమ్మన్ 2'కి (Mookuthi Amman 2) దర్శకత్వం వహించకపోవడంపై డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ ప్రాజెక్టుకు తన ప్రణాళికలు సరిపోలేదని అన్నారు. 'నాకు ఇప్పుడు 'మూకుత్తి అమ్మన్ 2' చేయడంలో ఆసక్తి లేదు. నా ప్రణాళికలు, నా ప్రయాణం, నేను రాసిన విషయాలు ఈ ప్రాజెక్టుకు సరిపోలేదు. ఈ మూవీ సీక్వెల్ ఎలా రూపొందించాలో నిర్మాతలకు ఇప్పటికే ఓ ప్రణాళిక ఉన్నప్పటికీ.. నా ప్రణాళికలు వేరుగా ఉన్నాయి.' అని పేర్కొన్నారు. అయితే.. 2020లో మూకుత్తి అమ్మన్‌కు (Mookuthi Amman) ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో ముక్కుపుడక అమ్మవారిగా నయనతార తన నటనతో మెప్పించారు. భక్తి పేరుతో దొంగబాబాలు చేసే మోసాలు, వారి పని పట్టే క్రమంలో హీరో ఎదుర్కొన్న పరిణామాలు, అతనికి అమ్మవారు ఎలా సాయం చేశారనేదే ప్రధానాంశంగా చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులోనూ 'అమ్మోరు తల్లి' పేరుతో రిలీజ్ అయిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
తాజాగా, ఈ మూవీకి సీక్వెల్ 'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభమైంది. సి.సుందర్ దర్శకత్వం వహిస్తుండగా.. చెన్నైలో ఇటీవల పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సి.సుందర్‌తో పాటు హీరోయిన్స్ నయనతార, మీనా, ఖుష్బూ, రెజీనా పాల్గొన్నారు. సాధారణంగా మూవీ ప్రమోషన్స్, ఈవెంట్స్‌కు దూరంగా ఉండే నయనతార.. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. 'ఆమె నిజంగా నయనతారేనా.. ఇదేంటీ కొత్తగా..' అంటూ కామెంట్స్ చేశారు.
భారీ బడ్జెట్‌తో..
'మూకుత్తి అమ్మన్ 2'లో నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగానికి భిన్నంగా సెకండ్ పార్ట్ ఉంటుందని.. గ్రాఫిక్స్ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్‌టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు సుందర్ 30 రోజుల్లోనే కథను రెడీ చేశారని.. ఇటీవల కాలంలో ఇలాంటి కథను తాను వినలేదని నిర్మాత గణేష్ తెలిపారు. అమ్మవారి పాత్రలో నయనతార కనిపిస్తారని.. ఆమె ఈ మూవీ కోసం నెల రోజులు ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దర్శకుడు సుందర్.సి ఇటీవల అరణ్మనై 4, మధగజరాజా చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లను అందించారు. గతంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించాలని భావించినా.. వివిధ కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు.