Rishab Shetty Reaction On Kantara Chapter 1: 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు కన్నడ స్టార్ రిషభ్ శెట్టి.
నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు
మూవీ షూటింగ్ టైంలో చెప్పులు వేసకోవడం మానేశారా? నాన్ వెజ్ తినలేదా? అంటూ ఎదురైన ప్రశ్నకు రిషభ్ రియాక్ట్ అయ్యారు. కొన్ని సీన్స్ షూట్ చేసిన టైంలో అలా చేసినట్లు చెప్పారు. 'ఈ సినిమాలో దేవునికి సంబంధించి సీన్స్ షూట్ చేసిన టైంలో నేను నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు. చెప్పులు వేసుకోలేదు. నేను దేవున్ని బాగా నమ్ముతాను. అందుకే ఆ సీన్స్ తెరకెక్కించేటప్పుడు నాకు నేనే పరిమితులు విధించుకున్నా. ఎవరి నమ్మకం వారిది. నేను ఇతరుల నమ్మకాల గురించి మాట్లాడను. నాకు ఎలాంటి గందరగోళం ఉండకూడదు. నా మనస్సుకు ఏదైనా క్లారిటీగా ఉండాలి.' అంటూ చెప్పారు.
షూటింగ్ టైంలో ఈ సీన్స్ విషయంలో తక్కువ మందితోనే షూట్ చేసినట్లు వెల్లడించారు రిషభ్. 'సాధారణంగా షూట్ జరుగుతున్నప్పుడు సెట్‌లో వేలాది మంది ఉంటారు. ఈ సీన్స్ టైంలో అలా జరగలేదు. తక్కువ మందితోనే షెడ్యూల్ కంప్లీట్ చేశాం. నేను ఎవరి నమ్మకాన్ని కూడా ప్రశ్నించను. దానిని గౌరవిస్తాను. అవతలి వారి నుంచి కూడా అదే ఆశిస్తాను.' అంటూ చెప్పారు.
ఆ వైరల్ పోస్టుపై...
ఇక 'కాంతార చాప్టర్ 1' చూసే ముందు నాన్ వెజ్ తినొద్దని, ఆచారాలు పాటించాలంటూ ఇటీవల ఓ ఫ్యాన్ మేడ్ పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపైనా స్పందించిన రిషభ్ శెట్టి... 'ఒకరి తినడం లేదా వ్యక్తిగత అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి ఇష్టం వారిది. ఎవరో ఓ వ్యక్తి నకిలీ పోస్ట్ అప్ లోడ్ చేశారు. అది మా దృష్టికి వచ్చింది. వారు వెంటనే దాన్ని తొలగించి సారీ చెప్పారు.' అని క్లారిటీ ఇచ్చారు.
'కాంతార చాప్టర్ 1'లో కొన్ని సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేరని... ముఖ్యంగా ఒక సీన్ ఆడియన్స్‌కు జీవితాంతం గుర్తుంటుందని చెప్పారు రిషభ్. ఇండస్ట్రీలో ఉన్న వారికి తనను చూసిన ప్రతీసారి ఆ సీన్ గుర్తొస్తుందని అన్నారు. 'కాంతార చిత్రం తర్వాత నా లైఫ్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సక్సెస్ నా టీంకు చెందుతుంది.' అంటూ చెప్పారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'వరాహ రూపం'ను మించేలా ఉన్న 'బ్రహ్మ కలశ' సాంగ్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.