Rishab Shetty On OTT Platforms: తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో కన్నడ నటుడు రిషబ్ శెట్టి సత్తా చాటారు. ‘కాంతార‘ చిత్రంలో అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. 2022లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ అయ్యింది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డుల ప్రకటన అనంతరం.. మీడియాతో మాట్లాడిన ఆయన కన్నడ సినిమా పరిశ్రమ గురించి, కన్నడ చిత్రాల విషయంలో ఉన్న వివక్ష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


కన్నడ సినిమాలను ఓటీటీలో కొనడం లేదు- రిషబ్ శెట్టి


కన్నడ సినిమా పరిశ్రమ గత కొంతకాలంగా అద్భుత పురోగతి సాధిస్తోందని రిషబ్ శెట్టి చెప్పారు. అయినా, తమ సినిమాల విషయంలో ఓటీటీ సంస్థలు వివకక్ష చూపుతున్నాయన్నారు. తెలుగు, తమిళ, మలయాళీ సినిమాలను పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనుకోనుగోలు చేస్తున్న ఓటీటీ సంస్థలు కన్నడ సినిమాల విషయానికి వచ్చే సరికి చిన్నచూపు చూస్తున్నాయని చెప్పారు. “మేము కష్టపడి సినిమాలు చేస్తాం, అవార్డులు గెల్చుకుంటాం. కానీ, మాకు సరైన ఫ్లాట్ ఫారమ్ లభించడం లేదు. ఓటీటీ సంస్థలు కన్నడ కంటెంట్ ను తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. మేం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. అందుకే, కన్నడ సినిమాలను యూట్యూబ్ లో పెడుతున్నాం. కష్టపడి చేసిన సినిమాలకు ఎలాంటి ప్రతిఫలం దక్కడం లేదు” అని చెప్పుకొచ్చారు.    


జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు- రిషబ్ శెట్టి


తనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదని రిషబ్ శెట్టి తెలిపారు. అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. "నేను నా పని మాత్రమే పర్ఫెక్ట్ గా చేయాలని భావిస్తాను. ‘కాంతార’ విషయంలో అలాగే చేశాను. ‘కాంతార’ సక్సెస్ ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ దక్కుతుంది. ఈ సినిమాకు నేను ఫేస్, దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంది. వారంతా ఈ సినిమా కోసం చాలా గొప్పగా పని చేశారు. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు. ఈ ప్రయణంలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. హోంబలే ఫిల్మ్స్‌ సపోర్టును మరువలేను. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగింది. ఇంకా మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తాను” అని చెప్పుకొచ్చారు.


రూ. 16 కోట్ల బడ్జెట్.. రూ.400 కోట్ల వసూళ్లు


‘కాంతార’ సినిమా సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇతర భాషల్లో ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు వసూళు చేసింది.  ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ మూవీ తెరకెక్కుతోంది. ‘కాంతార: ఎ లెజెండ్ -  ఛాప్టర్ 1’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది కన్నడతో సహా ఏడు భాషలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. 



Read Also: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!