P Susheela Hospitalized: ప్రముఖ గాయని పి. సుశీల (86) అస్వస్థకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కంగారు పడాల్సిన పనేమీ లేదని తెలిపారు. ఆగస్టు 17వ తేదీన ఆమె కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వైద్యులు కొన్ని టెస్ట్‌లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదని, అది సాధారణ కడుపు నొప్పే అని తెలిపారు. ఇదే విషయాన్ని సుశీల కుటుంబ సభ్యులు వెల్లడించారు. త్వరలోనే ఆమెని డిశ్చార్జ్ చేస్తారని అన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత చలన చిత్ర సంగీత చరిత్రలో పి. సుశీల పేరుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తుళు భాషల్లో 17 వేలకుపైగా పాటలు పాడారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆమె సంగీత ప్రయాణం కొనసాగింది. వయసు మీద పడడం వల్ల కొన్నేళ్లుగా ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తం 5 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న పి. సుశీల.. నేషనల్ అవార్డ్ సాధించిన తొలి గాయనిగా రికార్డు సృష్టించారు. ఎక్కువ పాటలు పాడినందుకు గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే తిరుపతికి వెళ్లిన సుశీలమ్మ తలనీలాలు సమర్పించారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన ఆమె తమిళ సినీ పరిశ్రమలో మంచి గాయకులు లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పాడే ఓపిక లేదని, లేదంటే కచ్చితంగా ఈ తరం వాళ్లతో కలిసి పాడే దాన్ని అని వెల్లడించారు.
"నాకు ఇప్పుడు వయసైపోయింది. శరీరంలో ఓపిక లేదు. ఓపిక ఉండి ఉంటే ఈ తరం వాళ్లతో పోటీ పడి మరీ పాటలు పాడే దాన్ని. ఇప్పటి సినిమాల్లో మంచి సంగీతమే వినిపించడం లేదు. గాయకులూ సరిగ్గా లేరు. ఇదంతా చూస్తుంటే ఎంతో బాధగా ఉంటోంది. ఎమ్‌ఎస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులు పాటే ప్రాణంగా బతికే వాళ్లు. వాళ్లకు పాటలు తప్ప మరో ప్రపంచమే లేదు. కానీ ఈ తరం అలా లేదు"
- పి. సుశీల, ప్రముఖ గాయని