దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంపై మళ్లీ కొత్త వాదనలు బయటకు వచ్చాయి. సుశాంత్ బాడీకి పోస్టు మార్టం నిర్వహించిన కూపర్ హాస్పిటల్ ఉద్యోగి సుశాంత్ మరణంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుశాంత్ ఆత్మ హత్య చేసుకోలేదని, అతడికి ముమ్మాటి హత్యేనని తేల్చి చెప్పాడు. ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు షేర్ చేసింది. “మీరు అగ్ని గుండా నడిచారు. వరదల నుంచి బయటపడ్డారు. రాక్షసులపై విజయం సాధించారు. మీరు మీ సొంత శక్తిని అనుమానించినప్పుడు దీన్ని గుర్తుంచుకోండి” అని రాసుకొచ్చింది. తన అభిమానులకు గుడ్ మార్నింగ్ చెప్తూ ఈ పోస్టును పంచుకుంది.
సుశాంత్ తో రియా డేటింగ్
జూన్ 2020లో, సుశాంత్ ఆకస్మిక మరణానికి ముందు రియా అతడితో కొంతకాలం డేటింగ్ చేసింది. తన మృతి కారణం రియా అని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుశాంత్ ను మనీలాండరింగ్ కు ప్రేరేపించిందని సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కోసం ఆమె నిషిద్ధ వస్తువులు సేకరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ మృతిపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సంస్థలు విచారణ జరిపాయి. ఈ సమయంలో రియాను సీబీఐ అరెస్టు చేసింది.
ఆత్మ హత్య కాదా? సుశాంత్ బాడీపై గాయాలున్నాయా?
సుశాంత్ మృతదేశానికి పోస్టుమార్టం నిర్వహించిన కూపర్ హాస్పిటల్ ఉద్యోగి, రూప్‌కుమార్ షా ఆయన మరణంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. “మేము పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు, అతడి దేహంపై చాలా గాయాలు కనిపించాయి. శరీరంతో పాటు మెడపై రెండు మూడు గుర్తులు కనిపించాయి. నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టంను వీడియో రికార్డ్ చేయాల్సి ఉంది. అయితే, మృతదేహానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే తీయాలని పై అధికారులు చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే చేశాం” అని వెల్లడించారు.
హత్య ఆరోపణలను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి- సుశాంత్ సోదరి
సుశాంత్ మరణంపై జరుగుతున్న పరిణామాల పై కుటుంబ సభ్యులు స్పందించారు. తాజా పరిణామాలు సుశాంత్ ది హత్యే అని వెల్లడిస్తున్నాయని ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి తెలిపారు. ఈ అంశాలను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శవపరీక్ష చేసిన సిబ్బంది హత్య అని చెప్పడం దిగ్భ్రాంతి కలిగించింది” అని శ్వేతా వెల్లడించింది. “ఈ సాక్ష్యంలో కొంత నిజం ఉన్నట్లు అనిపిస్తోందని, దీనిని సీబీఐ పరిశీలించాలని కోరుతున్నాం. న్యాయమైన విచారణ జరిపి, నిజానిజాలు మాకు తెలియజేస్తారని ఎప్పటినుంచో నమ్ముతున్నాం. మాకు ఇంకా సుశాంత్ మరణంపై క్లారిటీ రాలేదు. #జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్” అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Read Also: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే - అధికారులే అలా చేయమన్నారు - పోస్టుమార్టం ఉద్యోగి సంచలన ఆరోపణలు