సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి కెరీర్ ఎలా మారుతుందో చెప్పలేం. కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తే, మరికొన్ని నిర్ణయాలు అగాధంలోకి నెట్టేస్తాయి. అయితే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నప్పుడు మాత్రం, ఆ సమయంలో అలాంటి డెసిజన్ తీసుకోకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మన హీరోలు స్టోరీ నచ్చకో, డేట్స్ అడ్జస్ట్ చేయలేకనో అప్పుడప్పుడు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటి చిత్రాలు ఫ్లాపైతే పర్వాలేదు కానీ.. హిట్టయితే మాత్రం అభిమానులు ఫీల్ అవుతుంటారు. అలా మాస్ మహారాజా రవితేజ తిరస్కరించిన చాలా కథలు.. ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాయి. 

 

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ.. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలలో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. 'నీకోసం' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారిన రవితేజ.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ధమాకా చిత్రంతో 100 కోట్ల క్లబ్ లో చేరిన మాస్ రాజా.. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ కథలను రిజెక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రవితేజ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

 

1. పోకిరి:

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం పోకిరి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. అప్పటి వరకు ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి, సరికొత్త రికార్డులను తిరగరాసింది. అయితే ఈ చిత్రాన్ని పూరీ మొదట రవితేజకు ఆఫర్ చేశారట. అప్పటికే పలు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో మాస్ మహారాజా తిరస్కరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఈ కథ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి, చివరకు మహేశ్ వద్ద ఆగిందని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. 'పోకిరి' చిత్రం హిందీలో 'వాంటెడ్', తమిళంలో పోక్కిరి, కన్నడలో పోర్కి గా రీమేక్ చేయబడింది.

 

2. గబ్బర్ సింగ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్-కామెడీ డ్రామా 'గబ్బర్ సింగ్'. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా.. హిందీలో ఘన విజయం సాధించిన 'దబాంగ్' చిత్రానికి అధికారిక రీమేక్. అయితే ముందుగా ఈ మూవీని రవితేజతో తీయాలని మిరపకాయ దర్శకుడు భావించాడట. ఏం జరిగిందో ఏమో గానీ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది.

 

3. జై లవకుశ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవకుశ. కె ఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాకు దర్శకుడు. అప్పటికే పవర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బాబీ.. రవితేజతో ఈ కథను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశాడట. ఐతే కాంబినేషన్ సెట్ అవ్వకపోడంతో, కొరటాల శివ సహాయంతో తారక్ కు స్టోరీ నేరేట్ చేసి ఒప్పించాడట.

 

4. బాడీ గార్డ్:

విక్టరీ వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాడీ గార్డ్.  ఇది దిలీప్, నయనతారలు కలిసి నటించిన మలయాళ బాడీగార్డ్ యొక్క తెలుగు రీమేక్. అయితే దీని కోసం ముందుగా రవితేజని హీరోగా అనుకున్నారట. అప్పటికే మాస్ రాజాతో డాన్ శీను సినిమా చేసిన దర్శకుడు.. మరోసారి కలసి వర్క్ చేయాలని భావించాడట. కారణాలు ఏంటనేది తెలియదు కానీ.. రవితేజ ఈ రీమేక్ ఆఫర్ ని తిరస్కరించారట

 

5. ఆర్య:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆర్య. ఇది సుక్కూకి డైరక్టర్ గా ఫస్ట్ మూవీ. ముందుగా రవితేజతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. కానీ రవితేజ రిజెక్ట్ చేయడంతో, ప్రభాస్ తో సహా పలువురు హీరోలను కలిసిన సుకుమార్.. చివరకు బన్నీతో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బెంగాలీ, ఒడియా, సింహళం మరియు తమిళ భాషలలో రీమేక్ చేయబడింది.

 

6. గోదావరి:

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గోదావరి. ఈ చిత్రాన్ని మొదట రవితేజతో చేయాలని శేఖర్ భావించారట. అయితే అప్పటికే ఎస్ఎస్ రాజమౌళితో విక్రమార్కుడు సినిమాకు కమిట్ అవ్వడంతో, రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాడట.

 

7. ఆనందం:

రవితేజతో 'నీ కోసం' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీను వైట్ల.. వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్ 'ఆనందం' ను ఆఫర్ చేసాడట. అయితే అప్పటికే హీరోగా కొన్ని సినిమాలు కమిట్ అవ్వడంతో, ఆ ఆఫర్ ను సున్నితంగా తిర్కరించినట్లుగా టాక్. ఈ నేపథ్యంలో ఆకాశ్ హీరోగా ఆనందం సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు శ్రీను వైట్ల. ఇలా రవితేజ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని వదులుకున్నారు. మాస్ మహారాజా చేస్తే ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉండేదో చెప్పలేం కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఆ ప్రాజెక్ట్స్ తమ హీరోకి పడుంటే ఫిల్మోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉండేదని భావిస్తుంటారు.