Actress Priyamani About Ravi Teja: సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’. 2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ‘భామా కలాపం 2’ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
రవితేజ నా ఫేవరెట్ కో స్టార్- ప్రియమణి
‘భామా కలాపం 2’ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రియమణి, మాస్ మహారాజా రవితేజ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆయనతో కలిసి యాక్షన్ సినిమాలో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది. “చాలా కాలం క్రితం ఇద్దరం కలిసి ఓ సినిమా చేశాం. దాని పేరు ‘శంభోశివశంభో‘. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలవలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కలిశాం.. రవితేజకు సంబంధించిన అన్ని సినిమాలను చూశాను. మిస్ కాను. అయితే, థియేటర్లలో చూసే అవకాశం రాలేదు. ఓటీటీలో చూస్తున్నాను. ఆయన నా ఫేవరెట్ కో స్టార్. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నాడో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆన్ కెమెరాలో ఎలా ఉంటారో? ఆఫ్ కెమెరాలోనూ అలాగే ఉంటారు. ఇప్పటి వరకు మీరు చాలా యాక్షన్ సినిమాలు చేశారు. నేను కూడా ఇప్పుడిప్పుడే యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్షన్ సినిమా చేద్దాం?” అని రవితేజను అడిగింది.
కార్తీక్ ఘట్టమనేనితో చేద్దాం- రవితేజ
అటు ప్రియమణి ప్రశ్నకు రవితేజ ఆసక్తికర సమాధానం చెప్పారు. “ప్రస్తుతం యాక్షన్ మూవీస్ లో విపరీమైన కమాండ్ ఉన్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. చక్కటి సినిమాలతో మంచి పేరు వచ్చింది. చాలా మంది ఆయనను మెచ్చుకుంటున్నారు. అతడే మన యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇది మంచి ఐడియా కార్తీక్ ఆలోచించండి” అన్నారు రవితేజ.
‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్ ఈదార్ ఈ సినిమాను నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. అటు ప్రియమణి నటించిన ‘భామ కలాపం’ సినిమా కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాను సైతం అభిమన్యు తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సత్తా చాటింది.
Read Also: ఇది నాకు ఇష్టమైన వివాదం - అనసూయ