'పుష్ప: ద రైజ్', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'... ఒక సెట్ నుంచి మరొక సెట్‌కు... ఈ రెండు సినిమా షూటింగులు చేశారు రష్మికా మందన్నా. 'పుష్ప' సెట్ నుంచి 'ఆడవాళ్ళు...' సెట్స్‌కు వచ్చినప్పుడు రిలాక్సేషన్ కింద ఉండేదని రష్మిక తెలిపారు. అడవుల్లో 'పుష్ప' చిత్రీకరణ చేసి... శర్వానంద్ సినిమా చిత్రీకరణకు వస్తే పిక్నిక్ కింద అనిపించేదన్నారు. ముఖ్యంగా శర్వానంద్ ఇంటి నుంచి వచ్చే భోజనం బావుండేదని ఆమె చెప్పుకొచ్చారు.

 

శర్వానంద్‌కు జోడీగా రష్మికా మందన్నా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియాతో రష్మిక ముచ్చటించారు.

 

"నాకు ఫ‌స్ట్ లాక్‌డౌన్‌లో కిషోర్ తిరుమల స్క్రిప్ట్ చెప్పారు. సినిమాలో మహిళల పాత్రలు చాలా ఉన్నాయి. ఎవరు ఏ పాత్ర చేశారనే ఆసక్తి కలిగింది. ఎవరెవరు నటిస్తున్నారో చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. ఇంటర్వెల్ సీన్ నాకు బాగా నచ్చింది" అని రష్మిక చెప్పారు. ముక్కుసూటిగా మాట్లాడే ఆద్య పాత్రలో తాను నటించినట్టు చెప్పారు. సెట్ అంతా ఆడవాళ్ళు ఉండేవాళ్ళని, షూటింగ్ సరదాగా సాగిందని చెప్పుకొచ్చారు. కమర్షియల్ సినిమాలు, హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ సమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా సినిమా చేయడం సూపర్బ్ అని రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమల మహిళలకు ఎంత విలువ ఇస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని ఆమె అన్నారు.


"శర్వానంద్‌తో నటించడం సంతోషంగా ఉంది. హి ఈజ్ నైస్ కోస్టార్. సినిమాలో అతడిని మిగతా ఆడవాళ్లు ఎలా ఇబ్బంది పెట్టారనేది వినోదాత్మకంగా ఉంటుంది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ యాక్టర్లతో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాలు హైలైట్ అవుతాయి" అని రష్మికా మందన్నా అన్నారు.