ప్రస్తుత రోజుల్లో మంచి సినిమాలను తెరకెక్కించగానే సరిపోదు. వాటిని జనాల బుర్రల్లోకి ఎక్కేలా ప్రమోట్ చేయాలి. సినిమాను ఎలాగైనా వీలైనంత ఎక్కువ మార్కెట్ చేయాలి. అప్పుడే ఆడియెన్స్ మూవీ పట్ల ఆకర్షితులు అవుతారు. మంచి సినిమా చేశాం. ప్రమోషన్ లేకపోయినా ప్రేక్షకులు వస్తారని భావిస్తే, ఒక్కోసారి సినిమా ఇలా థియేటర్ లోకి వచ్చి అలా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, మేకర్స్ తమ సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అద్భుతమైన, విభిన్నమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘రంగబలి’ సినిమా విషయంలోనూ మేకర్స్ ఇదే పంథాను అవలంబించారు.
లోలోపల కుమిలిపోతున్న ఆ జర్నలిస్టులు
‘రంగబలి’ కోసం మీడియాలో పలువురు పాపులర్ జర్నలిస్టుల గెటప్ లో కమెడియన్ సత్య, హీరో నాగశౌర్యను ఇంటర్వ్యూ చేశాడు. ఈ ప్రమోషనల్ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి ఆ జర్నలిస్టులకు మాత్రం కక్కలేక మింగలేక అన్నట్లు ఫీలయ్యారట. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు బాగా హర్ట్ అయ్యారట. వారి మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయట. వెంటనే వాళ్లు ‘రంగబలి’ టీమ్‌కి సమాచారం అందించారట. ఈ నేపథ్యంలోనే ‘రంగబలి’కి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను విడుదల చేయలేదట మేకర్స్. పూర్తి వీడియోను చాలా మంది అభ్యర్థించినప్పటికీ, మనోభావాలు దెబ్బతింటాయనే కారణంగా దానిని తాత్కాలికంగా నిలిపివేశారట.
ఆ జర్నలిస్టులను అద్భుతంగా ఇమిటేట్ చేసిన సత్య
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ కమెడియన్స్ లో సత్య ఒకరు. ఇప్పటికే అగ్ర హీరోల సినిమాల్లో సత్య తన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'రంగబలి' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు రాబోతున్నాడు. యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రంగబలి'. జూలై 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశారు. అందులో పలు టీవీ, యూట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు చేసే పాపులర్ యాంకర్స్, మూవీ ప్రెస్ మీట్స్ లో వివాదాస్పద ప్రశ్నలు వేసే విలేకరులను సత్య ఇమిటేట్ చేయడమే కాకుండా ఆ జర్నలిస్టుల గెటప్స్ లో కనిపించాడు. వారిని అచ్చంగా దించేశాడు. ఓ లేడీ యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ.. గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని అరవడం ఈ ప్రోమోలనే హైలెట్ గా నిలిచింది.
‘రంగబలి’ సినిమా ద్వారా నూతన దర్శకుడు పవన్ భాసం శెట్టి టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. పవన్ సిహెచ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగశౌర్య గత చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఈ 'రంగబలి' సినిమా నాగశౌర్య కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.