Ranbir Kapoor as Police Officer: బాలీవుడ్‌లోని యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్లలో రణబీర్ కపూర్ కూడా ఒకడు. తను ఎంచుకునే కథ ఎలా ఉన్నా.. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అందులో తన నటనతో మెప్పించే విషయంలో మాత్రం రణబీర్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరించిన ఈ హీరో.. మొదటిసారిగా ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం రణబీర్ కపూర్ పోలీస్ యూనిఫార్మ్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోల్లో రణబీర్‌తో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా ఉండడంతో రోహిత్ కాప్ యూనివర్స్‌లో రణబీర్ కూడా జాయిన్ అయ్యాడా అని అనుమానాలు మొదలవుతున్నాయి.
రోహిత్ శెట్టితో రణబీర్..
ఇప్పటికే రణబీర్ కపూర్.. ‘యానిమల్’ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో మళ్లీ మళ్లీ చూడడానికి కూడా వెనకాడలేదు. ఇక ఈ మూవీ తర్వాత రణబీర్.. ఎవరితో సినిమా చేయనున్నాడు అనే అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే రణబీర్ కపూర్, కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో కలిసి ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా పోలీస్ యూనిఫార్మ్‌లో రణబీర్, రోహిత్ శెట్టి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చింది. దీంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇది సినిమా కాదు..
ఇప్పటికే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్‌లను పోలీసులుగా చూపించి.. వారితో ఒక కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు రోహిత్ శెట్టి. అయితే ఇప్పుడు ఈ కాప్ యూనివర్స్‌లోకి రణబీర్ కపూర్ కూడా జాయిన్ అవ్వనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ రణబీర్ ఫ్యాన్ పేజ్.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ఇది కేవలం ఒక యాడ్ షూట్ అని, ఆ యాడ్ కోసమే రణబీర్ పోలీస్ గెటప్ వేసుకున్నాడని స్పష్టం చేసింది. కానీ హీరో ఫ్యాన్స్ మాత్రం నిజంగానే రోహిత్ శెట్టిలాంటి కమర్షియల్ డైరెక్టర్‌తో కలిసి రణబీర్ ఒక మాస్ సినిమాను తీస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు సినిమా.. మరోవైపు సిరీస్..
ప్రస్తుతం రణబీర్ కపూర్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. రోహిత్ శెట్టి మాత్రం ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తను ‘సింగమ్ ఎగైన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రోహిత్ క్రియేట్ చేసిన కాప్ యూనివర్స్‌లో ఇది 5వ చిత్రం. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు రోహిత్. ఈ సిరీస్ కూడా ఇండియన్ పోలీస్ ఫోర్స్‌కు సంబంధించిందని సమాచారం. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఓబ్రాయ్, శిల్పా శెట్టి లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు.
Also Read: తండ్రికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చి పిల్లను పడేశాడు - ఆమిర్ ఖాన్ అల్లుడి బ్యాగ్రౌండ్ తెలుసా?