ఎటువంటి ఇమేజ్ చట్రంలో బందీ కానీ అతికొద్ది మంది తెలుగు కథానాయకుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తారు. మరో వైపు అప్పుడప్పుడూ అతిథి పాత్రల్లో తళుక్కున మెరుస్తారు. మంచి పాత్ర అని భావిస్తే... ప్రతినాయకుడిగా కనిపించడానికి కూడా వెనుకాడరు. 'బాహుబలి'లో భల్లాలదేవ పాత్రలో విలనిజం చూపించారు. 'భీమ్లా నాయక్'లో డానియల్ శేఖర్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఇప్పుడు 'కెజియఫ్ 3'లో విలన్‌గా కనిపిస్తారా? ఆయన మనసులో ఏముంది? కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.
KGF 3 Update: 'కెజియఫ్'లో రామచంద్రరాజు (గరుడ రామ్) విలన్ రోల్ చేశారు. 'కెజియఫ్ 2' (KGF 2)లో విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కనిపించారు. ఆయన గెటప్, రోల్‌కు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్' కంప్లీట్ అయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కెజియఫ్ 3' ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, అప్పుడే ఈ సినిమాలో విలన్ ఎవరనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది.
'కెజియఫ్ 3'లో విలన్ పాత్రకు రానా దగ్గుబాటిని సంప్రదించాలని దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ అనుకుంటున్నారని కన్నడ చిత్రసీమ వర్గాలు చెబుతున్నాయి. మరి, రానా ఏమంటారో చూడాలి. క్యారెక్టర్ నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి ఆయన రెడీ అని ట్రాక్ రికార్డ్ చూస్తే చెప్పవచ్చు.
హీరోగా రానా చేస్తున్న సినిమాలకు వస్తే... జూలై 1న వేణు ఊడుగుల దర్శకత్వంలో ఆయన నటించిన 'విరాట పర్వం' విడుదల కానుంది. అందులో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఆ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదలైన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
Also Read: 'కెజియఫ్ 3' ఉందండోయ్, అమెరికాలో రాకీ భాయ్ రఫ్ఫాడిస్తే?
'కెజియఫ్' సినిమా స్టార్ట్ చేసినప్పుడు రెండు భాగాలుగా తీయాలని అనుకోలేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. అయితే, 'కెజియఫ్'కు సీక్వెల్ గా 'కెజియఫ్ 2' వచ్చింది. 'కెజియఫ్' ఫ్రాంచైజీలో తొలి సినిమా కంటే రెండో సినిమా భారీ విజయం సాధించింది. అమెరికా నేపథ్యంలో సాగే మూడో సినిమా ఎలా ఉంటుందో? వెయిట్ అండ్ సీ.