RGV Saaree First Look :  టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈమధ్య తన సోషల్ మీడియాలో చీర కట్టుకున్న ఓ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి? అంటూ వరుస పోస్టులు చేసిన విషయం తెలిసిందే కదా. రాంగోపాల్ వర్మ చేసిన ఆ పోస్టులు నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి. చాలామంది నెటిజన్స్ ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎట్టకేలకు ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడిని తెలుసుకుని వర్మకు రిప్లై కూడా ఇచ్చారు. దాంతో ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆమెతో చీర అనే సినిమా తీస్తానని, ఆ అమ్మాయిని అందంగా వీడియోస్ తీసిన కెమెరామెన్ పిలిపించి మాట్లాడాడు.


చెప్పినట్టుగానే అదే అమ్మాయితో తాజాగా కొత్త సినిమాని ప్రకటించాడు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు శ్రీ లక్ష్మీ సతీష్. ఈమె మోడరన్ దుస్తుల్లో కాకుండా చీర కట్టులో ఫోటోషూట్ చేస్తుంది. చీర కట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని రీల్స్ షేర్ చేయగా దాన్ని చూసిన వర్మ చీరకట్టులో ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిపోయాడు. దీంతో ఆమెను ఎలాగైనా హీరోయిన్ చేస్తానని చెప్పాడు. ఇందుకు శ్రీలక్ష్మి సతీష్ కూడా ఒప్పుకోవడంతో నేడు శ్రీలక్ష్మి సతీష్ హీరోయిన్ గా రాంగోపాల్ వర్మ సినిమా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి 'శారీ' అనే టైటిల్ ఖరారు చేశారు.










తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శ్రీలక్ష్మి సతీష్ చీర కట్టులో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంది. ఈరోజు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా రాంగోపాల్ వర్మ ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇదొక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని వర్మ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. RGV డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో కెమెరామెన్ అఘోష్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇతనే శ్రీ లక్ష్మీ సతీష్ ని అందంగా ఫోటోలో తీసిన కెమెరామెన్. ఆ కెమెరా మాన్ నే డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తూ 'శారీ' సినిమాని నిర్మిస్తున్నారు వర్మ. కాగా ఇప్పటికే కొంతమంది అమ్మాయిల్ని వెండితెరకి హీరోయిన్ గా పరిచయం చేసిన వర్మ ఇప్పుడు శ్రీ లక్ష్మీ సతీష్ ని కూడా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.


మరి వర్మ చేతిలో పడిన శ్రీ లక్ష్మీ సతీష్ కెరియర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని తీశారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.


Also Read : ఆ పార్టీ నుంచి కంగనా పొలిటికల్ ఎంట్రీ, ఎంపీగా పోటీకి సిద్ధం