RGV Reviews Teja Sajja Mirai Movie: యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. తేజ, మంచు మనోజ్ నటనకు ప్రశంసలు కురుస్తుండగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ వేరే లెవల్‌లో ఉన్నాయంటూ సెలబ్రిటీలతో పాటు సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ మూవీపై రివ్యూ రాయగా మరోసారి వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై రియాక్ట్ అయ్యారు.
నన్ను నేనే కొట్టుకున్నా
'మిరాయ్' మూవీ చూశాక తనను తానే కొట్టుకున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. 'ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారిగా ఎప్పుడు చూశానో కూడా నాకు గుర్తు లేదు. రూ.400 కోట్లకు పైగా తీసిన మూవీస్‌లోనూ ఇంత గ్రాండ్ లుక్ లేదు. మంచు మనోజ్‌ను విలన్‌గా తీసుకుని తప్పు చేశారని ముందు అనుకున్నా. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూశాక నన్ను నేనే కొట్టుకున్నా. భారీ అడ్వెంచర్ మూవీలో తేజ చిన్న పిల్లాడిలా ఉంటాడు అనుకున్నా. ఇక్కడ కూడా నా అంచనా తప్పైంది.
విజువల్స్, స్క్రీన్ ప్లే, బీజీఎం, స్టోరీ అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ప్రేమ, మోసం, అతీంద్రియ శక్తులు, భారీ యాక్షన్ సీక్వెన్స్, డివోషనల్ టచ్ అన్నీ కలగలిపి పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది.' అని అన్నారు.
Also Read: మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?
డైరెక్టర్ డ్రీమ్... ప్రొడ్యూసర్ ప్యాషన్
'మిరాయ్' మూవీ డైరెక్టర్ కార్తీక్ అద్భుతమైన కల అని... పురాణాలు, హీరోయిజం కలిపి స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారని ఆర్జీవీ చెప్పారు. 'కార్తీక్‌కు అన్నీ విభాగాలపై ఉన్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాకపోయినా ఆయనకు ఉన్న ప్యాషన్ వల్లే ఇది సాకారమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా మీరు నమ్ముకున్న స్టోరీ, టీం వర్క్‌పై నమ్మకంతోనే ముందడుగు వేశారు. కేవలం లాభాలు మాత్రమే తీసుకురాకుండా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలను కూడా అందించారు. ఇది చిన్న సినిమా కాదు పెద్ద సినిమా.' అంటూ రాసుకొచ్చారు.
మనోజ్ రిప్లై
ఆర్జీవీ ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై ఇచ్చారు. 'అన్నా 'మిరాయ్' మూవీపై మీ రివ్యూ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలు చూస్తూ మీతో కలిసి పని చేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు మీ నుంచి నాకు ప్రశంసలు దక్కుతుంటే చాలా ఆనందంగా ఉంది.' అంటూ రిప్లై ఇచ్చారు.