Ram Gopal Varma Upcoming Movie: టాలీవుడ్‌లో నా రూటే సెపరేటు అనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎవరు ఎలా అనుకున్నా పర్వలేదు నాకు నచ్చిందే చేస్తా అనే మనస్తత్వం వర్మది. అదే మనస్తత్వం తన సినిమాల విషయంలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించి రికార్డులు తిరగరాసిన ఆర్జీవీ.. ప్రస్తుతం అన్ని అడల్ట్, పొలిటికల్ డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు వర్మ. ఆ టైటిల్ కంటే దానిపై వస్తున్న కామెంట్సే మరింత ఫన్నీగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ఇంతకు ఆ టైటిల్ ఏంటని అనుకుంటున్నారా.. ‘నా పెళ్లాం దెయ్యం’.


టైటిల్‌పై కామెంట్స్..


ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైర్‌లాగా తెరకెక్కిన ఈ చిత్రం.. చాలామంది దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కుంటోంది. అయినా అవేమీ పట్టించుకోకుండా తన తరువాతి సినిమాపై ఫోకస్ పెట్టారు వర్మ. అదే ‘నా పెళ్లాం దెయ్యం’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు వర్మ. అందులో దూరంగా ఒక మహిళ కిచెన్‌లో నిలబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. దాని కింద తాళి ఫోటో ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి పక్కన పెడితే.. దీని టైటిల్ గురించే నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


‘వ్యూహం’కు మిక్స్‌డ్ టాక్..


‘నా పెళ్లాం దెయ్యం’ అనే టైటిల్ చూసి ‘అందరి పెళ్లాలు దెయ్యాలే’ అని కామెంట్ చేశాడు ఒక నెటిజన్. ‘ఈరోజుల్లో ఇలాంటి సినిమా చాలా అవసరం’ అని మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ చూసి ఇతర నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇక ‘వ్యూహం’ విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం విడుదలయిన ఈ మూవీ మిక్స్‌డ్ రివ్యూలతో థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. కానీ ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ముందు దీని చుట్టూ పెద్ద రాజకీయమే నడిచింది. ఎన్నోసార్లు విడుదల తేదీని ప్రకటించి మరీ.. వాయిదా పడింది. ఏపీ రాజకీయ నాయకులు అయితే ‘వ్యూహం’పై తెగ ఫైర్ అయ్యారు. కానీ ఆర్జీవీ మాత్రం సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని, థియేటర్లలో కాకపోతే నేరుగా ఓటీటీలో విడుదల చేస్తానని కూడా ప్రకటించారు.






‘శారీ’తో బిజీ..


ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూర్గ్‌లో జరుగుతోంది. తాజాగా కూర్గ్‌లో సాంగ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని ఆర్జీవీ అప్డేట్ ఇచ్చారు. ఇందులో కేరళకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆరాధ్య దేవి హీరోయిన్‌గా నటిస్తోంది. వర్మ.. ముందు చిత్రాల తరహాలోనే ‘శారీ’ కూడా పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని మూవీ నుంచి విడుదలయిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ‘శారీ’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తన అప్‌కమింగ్ మూవీ ‘నా పెళ్లాం దెయ్యం’ గురించి అప్డేట్ ఇచ్చారు ఆర్జీవీ.


Also Read: మోహన్ బాబు నన్ను కావాలనే తోసేశారు - సీనియర్ నటి లిరీష