RC16 Pooja Ceremony: RRR సినిమాతో గ్లోబల్ స్టార్ డమ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద వుండగానే 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 


రామ్ చరణ్ బర్త్ డే దగ్గరలో ఉండటంతో 'RC 16' అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఆశించారు. ఈ నేపథ్యంలో రేపు బుధవారం (మార్చి 20) ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు. "అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ శుభసూచకంగా ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. #RC16 పూజా వేడుక రేపు ఉదయం 10.10 గంటలకు జరగనుంది" అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను షేర్ చేశారు. 






Also Read:  'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ 'జై హనుమాన్' కాదా?


హైదరాబాద్ వేదికగా ఓ ప్రైవేట్ హోటల్ లో RC 16 పూజా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయట. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే దీనిపై మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. 


'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రామ్ చరణ్ 16వ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. స్టార్ కాస్టింగ్ తో పాటుగా టాప్ టెక్నిషియన్స్ ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా 'RC 16' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఉత్తరాంధ్రలోని రామభద్రపురం నేపథ్యంలో ఈ రూరల్ డ్రామా కథంతా నడుస్తుంది. ఇందులో రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. పుట్టిన రోజు స్పెషల్ గా మార్చి 27న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశాలు వున్నాయి. 


ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ రామ్ చరణ్ ను 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్ లైన్ తో పిలుస్తుండగా.. ఇప్పటి నుంచి 'గ్లోబల్ స్టార్' అనే పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్టుగా వచ్చిన RC 16 పూజా వేడుకకు సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ లోనూ అదే ట్యాగ్ ను ఉపయోగించడం గమనార్హం.


Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'గేమ్ ఛేంజర్' వరకు.. క్రేజీ చిత్రాలన్నీ ఆ ఓటీటీలోనే!