మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. అందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ మధ్య ఆమె పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆవిడ, మళ్ళీ షూటింగుకు రానున్నారు.
రామ్ చరణ్ సినిమా సెట్స్‌కు ఈ నెలలోనే!
ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న తెల్లవారుజామున జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ కోసం వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇండియా రానున్నారు. శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఎందుకంటే... ఈ నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతానని కియారా అద్వాణీ తెలిపారు.
రామ్ చరణ్ మారలేదు, సేమ్ పర్సన్!
'వినయ విధేయ రామ'లో రామ్ చరణ్, కియారా అద్వాణీ జంటగా నటించారు. ఆ సినిమా సమయానికి, ఇప్పటికి ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా? అని ఆమెను అడగ్గా... ''ఏం మారలేదు. 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తర్వాత కూడా రామ్ చరణ్ సేమ్ పర్సన్ లా ఉన్నారు'' అని చెప్పారు. RC15 సినిమాలో తనతో పాటు రామ్ చరణ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తారని కియారా అద్వాణీ తెలిపారు.
జూన్‌లో గుమ్మడికాయ కొడతారా?
రామ్ చరణ్, శంకర్ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది. మధ్యలో కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రీకరణకు శంకర్ చెన్నై వెళ్ళడం, 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల్లో అవార్డులు రావడంతో రామ్ చరణ్ అక్కడకు వెళ్ళడం వల్ల బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట!
ఐఏఎస్ అధికారిగా...
ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్.
Also Read : ఎన్టీఆర్ సినిమాకు భారీ ప్లానింగ్ - హాలీవుడ్ నుంచి...
ఈ సినిమాలో మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంతో రామ్ చరణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో 'నాటు నాటు...' పాట ఆస్కార్స్ షార్ట్ లిస్టులో ఉండటం, ఇంకా పలు విదేశీ అవార్డులు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయబోయే చిత్రాలు సైతం అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని, ఆ సినిమా విడుదలకు ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడీ శంకర్ సినిమాతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు.