Lal Salaan Telugu Trailer: 'జైలర్'వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 'లాల్‌ సలామ్'. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను  లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్‌లు హీరోలుగా రజినీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'లాల్ సలామ్' మూవీ ఫిబ్రవరి 9న తమిళ్, తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రజనీ ముస్లింగా అతిథి పాత్రలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇక మూవీ రిలీజ్‌కు కొద్ది గంటలే ఉంది. దీంతో 'లాల్‌ సలామ్' ట్రైలర్‌పై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. మూవీ రిలీజ్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఇంకా ట్రైలర్‌ రిలీజ్‌ చేయకపోవడం తెలుగు ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. తాజాగా రిలీజైన ఈ ట్రైలర్‌ మత ఘర్షణల చూట్టూ సాగుతూ ఆద్యాంత ఆసక్తిగా సాగింది. 


ట్రైలర్‌ ఎలా ఉందంటే..


'ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నోళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలో వేశారు' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. మొదట్లోనే ఓ క్రికెట్ మ్యాచ్, అదే సమయంలో గ్రామంలో గొడవలను చూపించారు. ప్రశాతంగా ఉన్న ఊరిని శ్మశానంగా మారుస్తున్నారన్న వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. మూవీలో లీడ్ రోల్స్ లో విష్ణు విశాల్, విక్రాంత్ కనిపించారు. అయితే ట్రైలర్ నిమిషం తర్వాత గానీ రజనీ ఎంట్రీ ఉండదు. అలాగే ఇందులో మాజీ టిమిండియా కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఎంట్రీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ మత ఘర్షణలను ఓ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా చల్లార్చాలనుకునే మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీ కనిపించాడు. అయితే ట్రైలర్‌లో ప్లేయర్స్‌కు శిక్షణ ఇచ్చే కోచ్‌గా  కపిల్ దేవ్ కనిపించారు. ఇందులో ఆయన లుక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.



ఆ తర్వాత రజనీ ఎంట్రీ అదుర్స్‌ అనే చెప్పాలి. రాజకీయ నాయకులు, క్రికెట్‌, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్‌ (రజనీకాంత్‌) ఎంట్రీని ట్రైలర్‌కు చాలా ప్రత్యేకంగా నిలిచింది.  ఆ తర్వాత 'మందిని రూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడిని మాత్రం ప్రాణాలతో వదిలి పెట్టకూడదంటూ' అంటూ సాగే డైలాగ్‌ ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా రజనీతో చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌ హైలెట్‌గా నిలిచింది. ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఒక ఇండియన్‌గా నేర్చుకోవల్సింది అదే’ అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. 


నిమిషానికి కోటీ వసూలు చేసిన సూపర్‌ స్టార్‌?


రజనీ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు గుసగుసల వినిపిస్తున్నాయి. ఈ మూవీలో రజనీది అతిథి పాత్రే.. సుమారు 40 నిమిషాల పాటు కనిపిస్తారని టాక్‌. దానికే ఆయన రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. అదే నిజమైతే రజనీ నిమిషానికి రూ. కోటి వసూలు చేసినట్టు. తమిళంలో ఈసినిమాకు డోకా లేదు. కానీ తెలుగులోనే రిలీజ్‌పై మేకర్స్‌లో టెన్షన్‌ మొదలైంది. ఎందుకంటే ఫిబ్రవరి 8న యాత్ర 2 మూవీ రిలీజ్‌ అవుతుండగా.. లాల్‌ సలామ్‌ రోజే మాస్‌ మహారాజా రవితేజ ఈగల్‌ మూవీ రిలీజ్‌ అవుతుంది. మరి ఈ రెండు తెలుగు చిత్రాల పోటీ తట్టుకుని ఈ డబ్బింగ్‌ మూవీ ఎలా నిలబడుతుందో చూడాలి. ఇప్పటికే యాత్రకు, ఈగల్‌కు ఇక్కడ ఫుల్‌ బజ్‌ ఏర్పడింది. ఇంతకి హెవీ కాంపిటిషన్ లాల్‌ సలామ్‌ తట్టుకుంటుందా? ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్‌ను తొలిచేస్తున్న ప్రశ్న.