Rajeev Kanakala About Trolling On Heroes Families : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న‌ట్రోల్స్, ఫ్యాన్స్ వార్, నెగ‌టివిటీపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించి ఇప్ప‌టికే చాలా ఛానెల్స్‌ను డౌన్ చేయించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్. శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు దానిపై కంప్లైంట్ కూడా చేశారు. ద‌య‌చేసి ఇక నుంచి త‌ప్పుడు ప్ర‌చారాలు, తప్పుడు వీడియోలు పెట్టొద్దు అంటూ వాళ్లు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాజీవ్ కనకాల ఓ ఇంటర్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.


అది చాలా త‌ప్పు.. 


సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ముఖ్యంగా క‌నిపిస్తుంది ట్రోలింగ్. ఒక హీరో అభిమానులు మ‌రో హీరోని ట్రోల్ చేయ‌డం, వేరే హీరో సినిమాపై కామెంట్లు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఇక ఫ్యాన్ వార్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. వాటిపై మాట్లాడారు రాజీవ్ క‌న‌కాల‌. అలా చేయ‌డం చాలా త‌ప్పు అని అభిప్రాయ‌ప‌డ్డారు. "ట్రోల్స్ చేయొద్ద‌ని, అలాంటి పోస్ట్ లు పెట్టొద్ద‌ని కేవ‌లం రిక్వెస్ట్ మాత్ర‌మే చేయ‌గ‌లుగుతాం మేం. నేను ఒక్క‌టే చెప్పాల‌నుకుంటున్నాను. చూడండి బ్ర‌ద‌ర్ మీకు  రిక్వెస్ట్ ఏంటంటే? మ‌న స్టార్ ని మ‌నం మెచ్చుకుని మాట్లాడ‌టం వేరు. ప‌క్క స్టార్ ని త‌గ్గించి మాట్లాడ‌టం వేరు. నా గొప్ప‌త‌నం నేను చెప్పుకుంటే చాలు. నేను ఆ హీరో అభిమానిని చూశావా.. నేను ఇన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాను అంటే ఓకే.. ప‌క్క‌న వాళ్ల‌ని త‌క్కువ చేసి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు. మాట్లాడుకునే దాంట్లో మీరు మీరు తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. నెగ‌టివ్ అయిపోతున్నారు. నెగ‌టివ్ ఆలోచ‌న మ‌నిషిని విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేస్తుంది. ఇక ఆ త‌ర్వాత హీరోని లాగి, హీరోని కూడా బూతులు తిడుతున్నారు. ఒక చెట్టు ద‌గ్గ‌రికి వెళ్లి.. కూర్చుని రోజు నానా బూతులు తిడితే అది నెల రోజుల‌కి చ‌చ్చిపోతుంది. నెగ‌టివ్ ప‌వ‌ర్ అలాంటిది. నెగ‌టివ్ కామెంట్స్ చేసి, ట్రోల్స్ చేస్తే ఒక‌రు క‌చ్చితంగా బాధ‌ప‌డ‌తారు" అని అన్నారు రాజీవ్ క‌న‌కాల‌. 


ఈ మ‌ధ్యే ఇలా..  


"ఇలా ఇంత దిగ‌జారిపోయి మాట్లాడుకునే సంస్కృతి మ‌న‌లో ఎప్పుడూ లేదు. ఆరేళ్లు, ఏడేళ్ల నుంచే మొద‌లైంది. ఎందుకు కొత్త‌గా ఇలాంటివి? అప్పుడు ఫ్యాన్ కొట్లాట‌లు ఏంటి అంటే థియేట‌ర్ ల ద‌గ్గ‌ర క‌టౌట్లు విష‌యంలో వ‌చ్చేది. ఇప్పుడు మీడియా, సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎలా బ‌డితే అలా మాట్లాడుతున్నారు. ఆపండి, ట్రోల్ చేయొద్దు అంటే ఇంకా రెచ్చిపోతారు. ఇంకా ఎక్కువ‌గా అనేస్తారు. ఇంకా ప‌దిరెట్లు ఎక్కువ‌గా మాట్లాడేస్తారు" అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాజీవ్ క‌న‌కాల‌.   


ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై వ‌స్తున్న ట్రోల్స్, ఎన్నిక‌ల టైంలో అల్లు అర్జున్ పై వ‌చ్చిన నెగ‌టివ్ కామెంట్స్ త‌దిత‌ర అంశాల‌పై రాజీవ్ క‌న‌కాల పై విధంగా స్పందించారు. అంతేకాకుండా ఇక నుంచి ఎవ్వ‌రు త‌ప్పుగా మాట్లాడినా, త‌ప్పుడు వీడియోలు పెట్టినా మా అసోసియేష‌న్ ఊరుకోదు అని గ‌తంలో శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల కూడా కొన్ని డిజిట‌ల్ మీడియాల‌ను హెచ్చ‌రించారు. 


Also Read: 5 రోజులు షూటింగ్ చేశాక రకుల్‌ను ఆ మూవీ నుంచి తీసేశాం, చాలా బాధేసింది: దిల్ రాజు