ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా హాళ్లలో టికెట్ ధరలను సవరిస్తూ... ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీయం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి రాజమౌళి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
"వై.ఎస్. జగన్ గారికి, పేర్ని నాని గారికి థాంక్స్. టికెట్ ధరలను సవరిస్తూ కొత్త జీవో తీసుకు వచ్చి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సహాయం చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో సినిమా థియేటర్ల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను" అని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు. పెద్ద సినిమాలకు ఐదు ఆటలకు అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
"పెద్ద సినిమాలకు ఐదు ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి బిగ్ థాంక్స్. అలాగే, ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కూడా థాంక్స్. ఇది సినిమా పరిశ్రమకు పెద్ద సహాయం" అని రాజమౌళి పేర్కొన్నారు.
టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వ విడుదల చేసిన జీవో పట్ల చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఛాంబర్ పెద్దలు కూడా థాంక్స్ చెప్పారు.