Rajamouli Planning To Big Action Sequence In SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) కాంబోలో పాన్ వరల్డ్ మూవీ 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్
ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒడిశాలో ఓ షెడ్యూల్ పూర్తైంది. మూవీ తర్వాత షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని సమాచారం.
2 నెలలు షూటింగ్
ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం వీరంతా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మే నుంచి జూన్ వరకూ ఈ సీన్స్ షూటింగ్ చేస్తారని సమాచారం. దీని కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్ షూటింగ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: ఎన్టీఆర్ నీల్ 'డ్రాగన్'పై బిగ్ అప్‌డేట్ - ఈ వారంలోనే షూటింగ్ సెట్‌లోకి ఎన్టీఆర్
వెకేషన్స్ పూర్తి..
ఇటీవలే షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా ఒడిశాలోని సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సీన్స్ చిత్రీకరించారు. ఈ క్రమంలో మూవీ టీం కాస్త విరామం తీసుకుంది. రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం ఆయన కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లారు. ఇక మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్‌కు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు. అలాగే, ప్రియాంకచోప్రా సైతం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అందరి వెకేషన్స్ పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.
పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. అయితే, ఎలాంటి లీకులు లేకుండా జక్కన్న సహా మూవీ టీం ఫుల్ అలర్ట్‌గా ఉంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఈ స్టోరీ ఉండనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్, దేవాకట్టా డైలాగ్స్ అందిస్తున్నారు.
రిలీజ్ అప్పుడేనా..
ఈ సినిమాను 2027 మార్చిలో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు సమాచారం. ఆ రోజుకు సరిగ్గా 'RRR' రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. మరి దీనిపై కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారేమో అనే చర్చ సాగుతోంది.