Director Indraganti Mohan Krishna About Sarangapani Jathakam: 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam) సినిమాను చూసి నవ్వుకోవడమే కాకుండా ఇంటికి వెళ్లాక కూడా నాలుగైదు రోజులు నవ్వుకుంటారని ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohan Krishna) అన్నారు. మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.

'అందరివీ కొత్త రోల్స్'

ఈ మూవీలో అందరూ అంతకు ముందు వేయని కొత్త రోల్స్ చేశారని.. ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్ లైట్ హార్టర్డ్ ఫన్ ఫిల్మ్ అని ఇంద్రగంటి అన్నారు. 'స‌మ్మ‌ర్‌లో స‌ర‌దాగా సినిమాకు వెళ్లి చూసి న‌వ్వుకుంటూ అక్కడికక్క‌డే దులుపుకొని వ‌చ్చేసేలాగా కాకుండా.. ఇంటికి వెళ్లాక కూడా నాలుగైదు రోజుల పాటు రోల్స్, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేలా ఉండాలి అనుకుని తీసిన సినిమా ఇది. అలాగే నాకు చాలా తృప్తిని ఇచ్చిన సినిమా ఇది. మ్యాగ్జిమం అనుకున్న‌ట్లుగా సినిమాను తీయ‌గ‌లిగాను. వ్య‌క్తిగ‌తంగా 'సారంగపాణి జాతకం' సినిమాతో చాలా సంతోషంగా ఉన్నాను.' అని అన్నారు.

'జ్యోతిష్యులను కమెడియన్స్‌గా చూపించలేదు'

న‌మ్మ‌కం అనేది వ్య‌క్తిగ‌తమని.. మీకున్న న‌మ్మ‌కం ప‌ది మంది జీవితాల‌ను చిన్నాభిన్నం చేసేలా న‌మ్మొద్దు అన్న‌దే తన ఐడియా అని ఇంద్రగంటి అన్నారు. 'ఆ పాయింట్‌నే కామెడీగా చూపించాం. దానిపై కూడా ఎవ‌రైనా వ‌చ్చి గొడ‌వ చేస్తే ఏం చేయ‌లేం. జాత‌కాల‌న్నీ మూఢ‌ న‌మ్మ‌కాలు.. న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు అని నేను అన‌డం లేదు. ఎందుకంటే నాకే కొన్ని జ‌రిగాయి.. కొన్ని జ‌ర‌గ‌లేదు.

అందుకే నేను నా సినిమాలో జ్యోతిష్యులను కమెడియ‌న్స్‌గా కాకుండా సీరియ‌స్‌గానే చూపించాం. ఈ సినిమాను క్రైమ్ కామెడీ అనొచ్చు. ఎలాంటి హింస లేక‌పోయినా.. ఓ క్రిమిన‌ల్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్‌ను కారు షాప్‌లో చిన్న ఉద్యోగం చేసుకునే ఓ మధ్య తరగతి హీరో ఎలా హ్యాండిల్ చేశాడు అనే అంశం నుంచి కామెడీ జ‌న‌రేట్ అవుతుంది.' అని అన్నారు.

Also Read: చిరంజీవి ‘ఇంద్ర’, ప్రభాస్ ‘సలార్’ to సందీప్ కిషన్ ‘మజాకా’, టొవినో థామస్ ‘మిన్నల్ మురళి’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 20) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

'అందుకే మా సినిమా చూడాలి'

ఇటీవల కాలంలో యాక్షన్, మితిమీరిన హింసతో సినిమాలు వస్తున్నాయని.. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్స్ రాలేదని ఇంద్రగంటి అన్నారు. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు హ్యాపీగా, ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా 'సారంగపాణి జాతకం'. వినోదంతో పాటు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ అందిస్తుందన్నారు. 'నమ్మకం మూఢ నమ్మకం అయినప్పుడు మనిషిని బలహీనంగా మార్చేస్తుంది. అప్పుడు తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్న వారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తాడు. అలా జరిగినప్పుడు ఏర్పడే గందరగోళాన్ని కామికల్ వేలో ప్రెజెంట్ చేశాం.' అని అన్నారు.

వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం 'సారంగపాణి జాతకం'. 'జెంటిల్ మ్యాన్', 'సమ్మోహనం' చిత్రాల తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ - శివలెంక కృష్ణప్రసాద్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. ప్రియదర్శి సరసన రూపా కొడువాయూర్ హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.