ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి ( Rajamouli ) , నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ( CM Jagan ) సమావేశమయ్యారు. మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకుఎక్కడా సమస్యలు లేవు కానీ ఏపీలో మాత్రం పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఐదో ఆటకు...అలాగే టిక్కెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక అనుమతి కావాల్సి ఉంటుంది. వీటిపై చర్చేందుకు దానయ్య, రాజమౌళి సీఎం తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని ( Perni Nani ) వీరినీ సీఎం వద్దకు తీసుకెళ్లారు. 


ఇంతకు ముందు ఇచ్చిన జీవో ప్రకారం .. రెమ్యూనరేషన్లు కాకుండా సినిమా బడ్జెట్ ( Movie Budget ) రూ. వంద కోట్లు దాటితే టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇరవై శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉండాలని రూల్ పెట్టింది. అయితే ఆర్ఆర్ఆర్‌కు ప్రత్యేకంగా మినహాయిపు ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్‌కు సంబంధించిన జీఎస్టీ బిల్లులు..ఇతర ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌కు ఒక్క రోజు ముందు రూ. పాతిక పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. వారు తమ సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటిపోయిందన్నదానికి ఆధారాలు సమర్పించడం ఆలస్యం కావడంతో టిక్కెట్ రేటు పెంచుకునేందుకు ఉత్తర్వులు కూడా ఆలస్యంగా వచ్చారు. 


ఆర్ఆర్ఆర్ బాగా క్రేజ్ ఉన్న సినిమా కావడంతో బుకింగ్స్ ( RRR Bookings )  నాలుగైదు రోజులు ముందుగానే ప్రారంభమవుతాయి. అందుకే ఏపీలో టిక్కెట్ రేట్ల పెంపు, అదనపు షోలు..  ఇతర వాటి కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిఉంది. రాజమౌళి, దానయ్యల వినతిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారనేదానిపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ప్రత్యేక షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇస్తారా లేదా అన్న టెన్షన్ ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఉంది. అలాగే టిక్కెట్ రేట్ల పెంపు రూ. పాతిక సరిపోదని.. భావిస్తున్నారు. దాదాపుగా 80, 90 శాతం ధియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. 


టిక్కెట్ రేట్లను తాము అనుకున్నట్లుగా పెంచుకునేలా పర్మిషన్ ఇస్తే... కలెక్షన్లకు ఢోకా ఉండదని...లేకపోతే ఇబ్బంది అవుతుందని సినిమా యూనిట్ భావిస్తోంది. తెలుగు వెర్షన్‌కు సంబంధించినంత వరకూ ఏపీ మార్కెట్ నిర్మాతలు,  బయ్యర్లకు ఎంతో కీలకం. అందుకే రాజమౌళి కూడా ప్రత్యేక శ్రద్ధతో ఏపీ ప్రభుత్వ పెద్దలతో సమావేశమవుతున్నారు.