Rajadhani Files: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్జీవీ కంపెనీలో రూపొందిన 'వ్యూహం', 'శపథం' వంటి మరో రెండు పొలిటికల్ చిత్రాలు మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్నాయి. వాటికంటే ముందే ఇప్పుడు 'రాజధాని ఫైల్స్' అనే ఓ పొలిటికల్ డ్రామా థియేటర్లలోకి వచ్చేసింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమాగా ప్రచారం జరగడంతో, జనాల్లో ఆసక్తి నెలకొంది. అయితే శుక్రవారం రిలీజైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.
వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, అఖిలన్, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కంఠమనేని రవిశంకర్ నిర్మించారు. ఓ రాష్ట్ర రాజధాని, దానికి భూములిచ్చిన రైతుల పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. అరుణప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఐరావతి కోసం అక్కడి రైతుల నుంచి భూ సేకరణ చేస్తారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, అధికార వికేంద్రీకరణ పేరుతో నాలుగు రాజధానులను ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటారు. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన బాట పడతారు. అధికార పార్టీ ఈ ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రాంతంలోని రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఉద్యమాన్ని ఎలా నడిపించారు? రైతులకు ప్రతినిధులుగా ఉన్న హీరో కుటుంబం ఎలాంటి పాత్ర పోషించింది? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా మిగతా కథ.
Also Read: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?
'రాజధాని ఫైల్స్' అనేది ఫిక్షనల్ సినిమా అని చెప్పినప్పటికీ, కొన్ని నిజ జీవిత సంఘటనల ప్రేరణగా కల్పిత సన్నివేశాలను జోడించి తెరకెక్కించారనే విషయం అందరికీ అర్థమవుతుంది. స్టోరీ లైన్ గా చెప్పుకోడానికి బాగానే ఉన్నా, సినిమాగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడియెన్స్ కి నచ్చే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, సినిమా చాలా బోరింగ్‌గా సాగదీతగా ఉండటం, కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం, అసలు ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వకపోవడం ప్రధాన లోపాలుగా చెబుతున్నారు. కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి కానీ, ఎమోషన్స్ మిస్ అవ్వడంతో ఒక సినిమాగా ఏమాత్రం మెప్పించదని రివ్యూలు తేల్చేశాయి.
'రాజధాని ఫైల్స్'లో ప్రధాన నటీనటుల నటన ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. సీనియర్ యాక్టర్స్ వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకున్నారు. హీరోగా నటించిన పుష్పరాజ్ అఖిలన్ పర్వాలేదనిపించాడు.. కొన్ని సన్నివేశాల్లో మెప్పించాడు. మిగతా పాత్రల్లో పెద్దగా పేరు లేని నటీనటులే కనిపించారు. ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ, మణిశర్మ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. 2 గంటల 40 నిమిషాలు ఉన్న సినిమాని ఇంకాస్త బెటర్ గా ఎడిటింగ్ చేయాల్సింది. ఓవరాల్ గా ప్రధాన తారాగణం నటన మెప్పించినా, ఎమోషన్ మిస్ అవ్వడంతో ఈ సినిమా మెజారిటీ ఆడియన్స్ ను నిరాశ పరిచిందని చెప్పాలి.
Also Read: ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న మమ్ముటి 'భ్రమయుగం' - ఆ సీన్స్ చాలా టెర్రిఫిక్!