వినోదానికి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మారుతి తీసే సినిమాలు. మాస్, క్లాస్ అంటూ ఎటువంటి వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే కామెడీ అందించడం ఆయన స్టైల్. కామెడీతో పాటు మంచి కథ కూడా ఆయన సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది.
మెన్ ఎట్ వర్క్!
దర్శకుడు మారుతి ఈ రోజు ఉదయం ఓ ట్వీట్ చేశారు. 'మెన్ ఎట్ వర్క్' అంటూ పేర్కొన్నారు. అది ప్రభాస్ సినిమా గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి, ప్రభాస్ - మారుతి సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అందుకని, డైరెక్టుగా సినిమా అప్డేట్స్ ఇవ్వడం లేదు. పరోక్షంగా, ఈ విధంగా అభిమానులకు హింట్స్ ఇస్తున్నారు. కొందరు అయితే ఈ హింట్ చాలు చెలరేగిపోవడనికి అంటుంటే... మరికొందరు అప్డేట్ అంటూ అడుగుతున్నారు. అదీ సంగతి!
ప్రభాస్, మారుతి సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయిన్ అయ్యారు. అదీ సంగతి!
ముగ్గురు హీరోయిన్లు ఎవరు?
ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అని చర్చ జరుగుతోంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, 'రాధే శ్యామ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన రాజ్ తరుణ్ 'లవర్స్' ఫేమ్ రిద్ధి కుమార్ ఎంపిక అయ్యారని తెలిసింది. అయితే, ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. హారర్ కామెడీతో ఈ సినిమా రూపొందుతోంది.
టైటిల్ ఖరారు చేసినట్టేనా?
ప్రభాస్, మారుతి సినిమా అనౌన్స్ చేయడానికి ముందు నుంచి 'రాజు డీలక్స్' టైటిల్ ప్రచారంలో ఉంది. దాదాపుగా ఆ టైటిల్ ఖరారు కావచ్చని సమాచారం. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28న 'సలార్' సినిమా వస్తుంది. ఆ వెనుక 'ప్రాజెక్ట్ కె' ఉంది. వీటి మధ్యలో 'రాజు డీలక్స్' అప్డేట్స్ ఇవ్వడం ఎందుకు? అని యూనిట్ భావిస్తోందట.
Also Read : జై భజరంగ్ బలి - ప్రభాస్ 'ఆదిపురుష్'లో హనుమంతుడిని చూశారా?
'ప్రేమ కథా చిత్రమ్', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' సినిమాలు చూస్తే చాలు... మారుతి ఏ స్థాయిలో నవ్విస్తాడు? అనేది అందరికీ అర్థం అవుతుంది. ఆ కథల్లో కామెడీతో పాటు అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుంది. ప్రభాస్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహబలి' కంటే ముందు చేసిన సినిమాల్లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' సినిమా అందుకు మంచి ఉదాహరణ. అందువల్ల, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా రోజుల తర్వాత రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూడవచ్చని ఆశిస్తున్నారు. సినిమాపై అంచనాలు బావున్నాయి. మారుతికి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది.
Also Read : దుబాయ్‌లో ఉపాసన సీమంతం - భార్యతో రామ్ చరణ్