Kaatera Movie: ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోహీరోయిన్ల వారసులు.. ఇండస్ట్రీలోకి నటులుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అందరికీ ఒకేవిధంగా సక్సెస్ దక్కలేదు. కొందరికి మాత్రం డెబ్యూ నుండే సక్సెస్‌ఫుల్ నటులుగా గుర్తింపు లభిస్తే.. కొందరు మాత్రం ఇప్పటికీ ఆ గుర్తింపు కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇక ఒకప్పుడు తెలుగు, కన్నడ సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగిన మాలశ్రీ.. తన వారసురాలు రాధనా రామ్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ సరసన హీరోయిన్‌గా డెబ్యూ చేసిన రాధనాకు మొదటి సినిమానే సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఈ మూవీ ‘సలార్’కే పోటీగా దూసుకుపోతోంది.


ధైర్యంగా ముందుకొచ్చిన ‘కటేరా’..
మాలశ్రీ వారసురాలు కావడంతో రాధనా రామ్‌కు కన్నడ స్టార్ హీరో దర్శన్ సరసన డెబ్యూ చేసే అవకాశం లభించింది. దర్శన్ హీరోగా తెరకెక్కిన ‘కటేరా’ మూవీ.. ‘సలార్’, ‘డంకీ’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీగా విడుదలయ్యింది. ‘సలార్’, ‘డంకీ’ పాన్ ఇండియా చిత్రాలు అయినా వాటితో పోటీకి వెనకాడలేదు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’.. అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్‌ను సాధించగా.. కన్నడలో మాత్రం ‘కటేరా’ కలెక్షన్స్‌ను బీట్ చేయలేకపోతోంది. ‘సలార్’లాంటి సినిమాకు ఎదురువెళ్లడం కరెక్టేనా అని మూవీ రిలీజ్‌కు ముందు హీరో దర్శన్‌ను ప్రశ్నించగా.. వేరే భాష సినిమాల కోసం మన భాష సినిమాను పక్కకు తప్పుకోమని అనడం కరెక్ట్ కాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక తాను నమ్మినట్టుగానే ‘కటేరా’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది.


పల్లెటూరి అమ్మాయి పాత్రలో..
రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేశ్.. ‘కటేరా’ను నిర్మించారు. ‘రాబర్ట్’ ఫేమ్ తరుణ్ సుధీర.. ఈ మూవీకి రచయుతగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఈ మూవీతో ప్రముఖ హీరోయిన్ మాలశ్రీ కూతురు హీరోయిన్‌గా పరిచయమవుతుంది అని తెలియగానే సోషల్ మీడియాలో తనకు క్రేజ్ పెరిగింది. ‘కటేరా’లో పల్లెటూరి పిల్లగా కనిపించి.. తన నటనతో ఆకట్టుకుంది రాధనా రామ్. ప్రభావతి పాత్రలో తన నటన అద్భుతంగా ఉందని, ఇలాగే కొనసాగిస్తే.. తనకు కన్నడలో మంచి అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. అంతే కాకుండా రాధనా ఇలాగే కొనసాగిస్తే.. తన తల్లి మాలశ్రీలాగా తను కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ముంబాయ్‌లో కోచింగ్..
రాధనా రామ్.. మాలశ్రీ కూతురిలాగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నానని సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడే చెప్పింది. అందుకోసమే ముంబాయ్‌లో ప్రత్యేకంగా డ్యాన్స్, యాక్టింగ్ కోసం కోచింగ్ కూడా తీసుకుంది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో అడుగుపెట్టడం కోసం ఎంతో కష్టపడుతూ తనను తాను మలచుకుంది రాధనా. ఫైనల్‌గా ‘కటేరా’తో తన కష్టానికి ఫలితం లభించింది. కూతురి సక్సెస్ చూసి మాలశ్రీ కూడా సంతోషంలో మునిగిపోయింది. ఇక మాలశ్రీ కూతురు అనడంతో పాటు మంచి నటి అనే ట్యాగ్‌ను కూడా సంపాదించుకుంది కాబట్టి రాధనాకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయని కన్నడ ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్ బచ్చన్ - ఇక సెలవంటూ భావోద్వేగం