Puneeth Rajkumar's Appu Movie Re Release Date: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) ఫ్యాన్స్‌కు 'అప్పు' (Appu) అంటేనే ఓ ఎమోషన్. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో 2002లో వచ్చిన ఫస్ట్ మూవీ 'అప్పు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఎంతలా అంటే ఆయనకు 'అప్పు' అనేది నిక్ నేమ్‌గా మారిపోయేంతగా హిట్ అయ్యింది. అప్పు సార్.. అప్పు సార్ అంటూ ఆయన్ను అభిమానులు ప్రేమతో పిలుచుకుంటారు. ఈ మూవీ దాదాపు 200 రోజులు థియేటర్లలో ఆడి రికార్డులు సృష్టించింది. ప్రేమ, యాక్షన్, కామెడీతో కూడిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అప్పు.
తెలుగు, తమిళం, ఒడియా, బంగ్లా భాషల్లోనూ ఈ మూవీని రీమేక్ చేశారు. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా 'ఇడియట్' పేరుతో ఈ మూవీని రీమేక్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ 50వ జయంతి సందర్భంగా 'అప్పు' సినిమాను మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా థియేటర్లలోకి మళ్లీ విడుదల చేయనున్నట్లు చెప్పారు.
గుండెపోటుతో హఠాన్మరణం
కన్నడ కంఠీరవ, తండ్రి రాజ్ కుమార్ వారసత్వంతో వెండి తెరకు పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ నటుడిగా ఎదిగారు. 6 నెలల వయసులోనే బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి.. 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. వరుస విజయాలతో అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు. 2021, అక్టోబర్ 29న గుండెపోటుతో పునీత్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం సినీ ప్రముఖులతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, డ్యాన్సర్, నిర్మాతగా వ్యవహరించడం సహా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అప్పు ముందుండేవారు.
ఓ స్నేహితుడి ద్వారా బెంగుళూరుకు చెందిన అశ్వినితో పునీత్ రాజ్‌కుమార్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1999లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వివాహానంతరం వీరు సొంత నిర్మాణ సంస్థ 'PRK ప్రొడక్షన్స్' స్థాపించారు. దీని ద్వారా 2019లో ఫస్ట్ మూవీ 'కవలుదారి' నిర్మించారు. తర్వాత మాయాబజార్, లా, ఫ్రెంచ్ బిర్యానీ రూపొందాయి. పునీత్ అకాల మరణం తర్వాత ఆయన సేవా కార్యక్రమాలను అశ్విని కొనసాగిస్తున్నారు.
Also Read: అనగనగా ఆ ఊరి పేరు 'ప్రభాస్' - ఎక్కడో తెలుసా.. ఎలా వెలుగులోకి వచ్చిందంటే?