Prabhas Village: అనగనగా ఆ ఊరి పేరు 'ప్రభాస్' - ఎక్కడో తెలుసా.. ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
Nepal Prabhas Village: రెబల్ స్టార్ 'ప్రభాస్' పేరుతో ఓ విలేజ్ ఉందని మీకు తెలుసా.?. మన పొరుగు దేశం నేపాల్‌లో ఈ విలేజ్‌ను ఓ మోటో బ్లాగర్ గుర్తించి నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

Prabhas Village In Nepal Vlogger Video Gone Viral: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అంటేనే ఫ్యాన్స్‌కు ఓ ప్రత్యేకమైన క్రేజ్. 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. 'బాహుబలి 2', సలార్, సాహో వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆయన పేరుతో ఓ ఊరే ఉందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది ఇండియాలో కాదు నేపాల్ దేశంలో. ఈ విషయం ఓ టూర్ వ్లాగర్ తన పర్యటనలో భాగంగా నెట్టింట పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అసలు ఆ ఊరి విశేషాలేంటో చూద్దామా..
ఇండియాకు పొరుగు దేశమైన నేపాల్‌లోనే (Nepal) 'ప్రభాస్' అనే పేరుతో ఓ విలేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మోటో బ్లాగర్.. నేపాల్ పర్యటనలో ఉన్నాడు. ఇందులో భాగంగా ఆయన బైక్ రైడింగ్ చేస్తుండగా ఊహించని విధంగా ఆయనకు 'ప్రభాస్' అనే పేరుతో ఓ ఊరు కనిపించింది. దీంతో వెంటనే వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. 'ప్రభాస్ పేరుతో నేమ్ బోర్డు చూడగానే నాకు డార్లింగ్ ప్రభాస్ గుర్తొచ్చారు. ఆయన పేరుతో ఓ ఊరే ఉండడం నిజంగా ఓ సర్ ప్రైజ్.' అని తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పేరుతో ఓ ఊరే ఉండడమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీ బిజీ
మరోవైపు, వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్'లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అలాగే, దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ'ని పట్టాలెక్కించారు. సందీప్ వంగారెడ్డితో స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి 2 మూవీలు చేస్తున్నారు. అటు.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ కెరీర్‌లోనే హిట్‌గా నిలిచిన రీసెంట్ మూవీ 'సలార్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఊహించని కలెక్షన్లు రావడంతో ఫ్యాన్స్‌తో పాటు నిర్మాతలు సైతం ఖుషీ అయ్యారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. మార్చి 31న మూవీని మరోసారి థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలకపాత్రలు పోషించారు.