టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన, సోమవారం మృతి రాత్రి 8 గంటలు దాటిన తర్వాత తుది శ్వాస విడిచినట్టు తెలిసింది. ఆయన మృతికి సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు దిల్ రాజుకు ఫోన్ చేసి పరామర్శించారు.


శ్యామ్ సుందర్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఉదయం 6.30 గంటలకు ఎమ్మెల్యే ఎంపీ కాలనీలోని దిల్ రాజు నివాసానికి తీసుకురానున్నారు. ఉదయం 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. 


శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి గ్రామం. దిల్ రాజు తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే అందరూ రాజు అనే పిలవడంతో, అదే పేరుగా ప్రచారంలోకి వచ్చింది. వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. 


సినీ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన వెంకట రమణారెడ్డి.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. తనకు విజయాన్ని అందించిన తొలి సినిమా టైటిల్ నే తన పేరుగా మార్చుకొని 'దిల్' రాజు అయ్యారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన మొదటి భార్య పేరు అనిత. తన ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలన్నిటికీ ఆమె సమర్పకురాలుగా ఉన్నారు. వీరికి హన్షిత రెడ్డి అనే కుమార్తె కూడా ఉంది.


అయితే అనితా రెడ్డి 2017లో అనారోగ్య కారణాలతో మరణించిన తర్వాత 2020లో వైఘా రెడ్డిని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఆయన కూతురు హన్షిత రెడ్డి కూడా తండ్రి బాటలో సినీ నిర్మాణంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 'బలగం' లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తోంది. 


Also Read: 'బలగం' వేణు బాటలో మరో కమెడియన్, దిల్ రాజు మరో ప్రయోగం చేస్తున్నారా ?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial