B Nagireddy Biography New Book Launched : 'పాతాళ భైరవి', 'మాయా బజార్', 'మిస్సమ్మ'... ఈ మూవీస్ పేరు వింటేనే ఒకప్పటి ట్రెండ్‌కు గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పటికీ ఇవి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో లేని ఆ రోజుల్లోనే సిల్వర్ స్క్రీన్‌పై మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు అప్పటి మేకర్స్. ఈ మూవీస్‌ను రూపొందించింది లెజెండరీ ఫేమస్ ప్రొడ్యూసర్ బి.నాగిరెడ్డి. ఆయన జీవిత చరిత్ర, కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా ఆయన కుమారుడు ఓ బుక్ రిలీజ్ చేశారు.
గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం
బి.నాగిరెడ్డి గారు తెలుసా మీకు? అని అడిగితే పాపం అవుతుంది. ఆయన గురించి ఏం తెలుసు? అని అడిగితే దోషం అవుతుంది. ఓ సినిమా సగంలోంచి చూస్తే ఎలా అర్థం కాదో, బి.నాగిరెడ్డి లాంటి మహానుభావుల గురించి తెలుసుకోకపోతే తెలుగు సినిమా చరిత్ర అస్సలు అర్థం కాదు. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’ వంటి కళాఖండాలు తీశారనో లేదా ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో ‘విజయా వాహినీ’ కట్టారనో-‘విజయా’ సంస్థతో తెలుగు సినిమాకు స్వర్ణయుగం చూపించారనో... జగమెరిగిన చిల్డ్రన్స్ మ్యాగజైన్ 'చందమామ' సంస్థాపకులనో కాదు. నాగిరెడ్డి ఓ గొప్ప నిర్మాతగానే కాదు... ఆయన జీవితమే ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం.
Also Read : ఒకే రోజు రెండు ఓటీటీల్లో 'సంతాన ప్రాప్తిరస్తు' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అది ఎలా సాధ్యం?
ఉల్లిపాయల వ్యాపారం చేసినవాడు, వీధుల్లో పోస్టర్లు కట్టినవాడు, అందంగా శుభలేఖలు అచ్చు వేయించినవాడు, ఊరూరా తిరిగి ఖద్దరు అమ్మినవాడు... తెలుగు సినిమా జెండాపై కపిరాజు కాగలిగాడు. అసలు ఇదంతా బి నాగిరెడ్డికి ఎలా సాధ్యం? ఇలా అనేక విషయాలు తెలుసుకోవాలన్నా... ఆ గొప్ప చరిత్ర సాక్షాత్కారం కావాలన్నా... 'B.Nagi Reddi - A Son's Memoir' అని ఆంగ్లంలో ఓ పుస్తకం తాజాగా విడుదలైంది.
ఈ బుక్‌ను నాగిరెడ్డి మూడో తనయుడు విశ్వనాథరెడ్డి రాశారు. తన తండ్రి తాలూకు జీవన పర్వాన్ని- ఒడుదొడుకుల్ని, కష్టాల్ని ఎదురొడ్డిన తీరుని, ఎన్నెన్నో తీపి చేదు గుర్తుల్ని, జయాపజయాల ఘట్టాల్ని కళ్లకు కట్టినట్టుగా ఓ స్క్రీన్ ప్లేతో అధ్యాయాల వారీగా ఆవిష్కరించారు.ఈ గ్రంథానికి కన్సెల్టెంట్ ఎడిటర్ ఆరితేరిన కలం యోధుడు ఎమ్మెల్ నరసింహం. బుక్ లోపల పేజీలన్నీ తెల్ల మల్లెపువ్వుల్లా ఆ కాలపు జ్ఞాపకాలన్నింటినీ గుబాళింపచేస్తాయి.
ఆ సంఘటన మర్చిపోలేం
ఈ బుక్‌లో ఓ ఇన్సిడెంట్‌ను అద్భుతంగా వివరించారు. విజయా స్టూడియోలో వేసిన సెట్‌లో 'గుండమ్మ కథ' (తమిళ వెర్షన్) హోటల్ సీన్ షూట్ చేస్తున్నారు. జెమినీ గణేశన్ టిఫిన్ చేయడానికి ఆ హోటల్‌కి వస్తారు. అక్కడున్న సర్వర్ గమ్మత్తుగా బిహేవ్ చేస్తాడు. చాలా చిన్న వేషం అది. ఆ సర్వర్ చురుకుతనం చూసి... పారితోషకం ఎంత అని అడిగారు. అందుకు అతను రూ.250 అని చెప్పారు. దీంతో అతని వివరాలు కనుక్కున్నారు.
వారం రోజుల్లో అతని పెళ్లి. పెద్దలకు తెలియకుండా అతను ప్రేమించిన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. నాగిరెడ్డి గారు క్యాషియర్‌ని పిలిచి, అతనికి రూ.1000 చెక్ ఇప్పించారు. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే... 'తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా చేశారు కదా, అందుకే రూ.1000'. అని నాగిరెడ్డి చెప్పగానే, అతను చాలా సంబరపడిపోయాడు. ఆ నటుడు తర్వాత తమిళ ఇండస్ట్రీని ఏలాడు. తెలుగునాట కూడా బాగా పాపులర్. ఆయనే నగేష్. ఈ సందర్భాన్ని నగేష్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా.
ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 252 పేజీల ఈ బుక్ ధర రూ.500. ప్రారంభ ఆఫర్‌గా డిసెంబర్ 31 లోపు కొనుక్కుంటే రూ.400కే లభిస్తుంది. వివరాలకు: విజయా పబ్లికేషన్స్, చెన్నై, ఫోన్ నెం: 9941906702, E-Mail: vijayapublications@gmail.com.