ఎవరైనా సినిమా మీద నెగిటివ్ మాట్లాడారంటే అది అవతలి వాళ్లంటే ఇష్టం లేకనో నిజంగా సినిమా బాగోలేకనో అనుకోవచ్చు. కానీ సొంత నిర్మాతే... తన సినిమాలో కథే ఏముందని మాట్లాడితే హాట్ టాపిక్కే మరి. ఇప్పుడు నిర్మాత అశ్వనీదత్ చేసిన కామెంట్స్ అచ్చం అలాంటివే.


'అలీతో సరదాగా' కార్యక్రమానికి 'సీతా రామం' విజయంతో మంచి సంతోషంలో ఉన్న నిర్మాత చలసాని అశ్వనీదత్ వచ్చారు. ఆయనకు, ఆలీకి మధ్య 'జాతి రత్నాలు' సినిమా (Jathi Ratnalu Movie) టాపిక్ వచ్చింది.
 
కొవిడ్ మహమ్మారితో ప్రజలంతా భయభ్రాంతులతో బతుకుతున్న టైంలో ఓ మంచి రిలీఫ్ లా వచ్చిన సినిమా 'జాతి రత్నాలు'. మార్చి 11, 2021న విడుదలైన ఆ సినిమా ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోలుగా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన యాక్టింగ్, అనుదీప్ కేవీ సెన్సిబుల్ డైరెక్షన్, నిర్మాతగా నాగ్ అశ్విన్... స్వప్న సినిమాస్ బ్యానర్ పై చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.


కలెక్షన్లతో కుమ్మేసిన 'జాతి రత్నాలు'
అసలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చాలా డిఫరెంట్ ప్రమోషన్స్ తో దూసుకెళ్లింది చిత్రబృందం. అప్పటివరకూ ఫాలో అయిన పద్ధతులకు చాలా భిన్నంగా సినిమాను నాగ్ అశ్విన్ అండ్ టీం ప్రమోట్ చేసింది. సక్సెస్ టూర్ అంటూ విదేశాల్లోనూ ప్రమోట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఈ సినిమాకు దక్కిన క్రేజ్ ఏంటో.  దీంతో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాకు. కథ వీక్ గా ఉందనే కామెంట్ తప్పితే... కలెక్షన్ల పరంగా కుమ్మిపారేసింది 'జాతి రత్నాలు'. 


రిలీజ్ తర్వాత కేవలం మౌత్ పబ్లిసిటీ కారణంగా కరోనా భయాన్ని లెక్క చేయకుండా జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. సీన్ సీన్ కు పగలబడి నవ్వుతూ థియేటర్లలో ఎంజాయ్ చేశారు. అందరి అంచనాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. బడ్జెట్ ఎంతో టీమ్ ఎప్పుడూ చెప్పకపోయినా లో బడ్జెట్ సినిమా అని చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి జాతిరత్నాలు ఫుల్ రన్ లో 27 కోట్లకు పైగా లాభాలను వసూలు చేసిందని టాక్. 


అసలు కథ ఎక్కడుంది?
ఇంత సెన్సేషన్ సృష్టించిన సినిమాపై అలీ అడిగిన ప్రశ్నలకు అశ్వనీదత్ నవ్వేశారు. అసలు ఈ సినిమా తీయాలనే ఆలోచనా అశ్వనీదత్‌దా? నాగ్ అశ్విన్‌దా? అంటే... ఈ సినిమా తీయాలనే ఆలోచన వెనుక తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. నాగ్ అశ్విన్ మిత్రుడు అనుదీప్ కథ చెబితే... నాగితో పాటు స్వప్న, ప్రియాంకలకు సినిమా నచ్చిందని... తనకు కథ వినిపిస్తే అసలు అందులో కథేముందో అర్థం కాలేదన్నారు అశ్వనీదత్. అది కేవలం కొన్ని కామెడీ సీన్లను కలిపేసిన కథ అన్నారు తప్ప అందులో ఏముందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదన్నారు.


థియేటర్లలో పగలబడి నవ్వుకున్నారు
జాతిరత్నాలు సృష్టించిన సెన్సేషన్ గురించి అడిగితే...ఆ సినిమా రిలీజ్ టైం లో థియేటర్ కు వెళ్లిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు అశ్వనీదత్. కొవిడ్ భయాలతో జనాలు థియేటర్లకు వస్తారా? అని భయపడుతూనే థియేటర్ కు వెళ్లానన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కొవిడ్ భయాన్ని మర్చిపోయి మాస్క్ తీసి పక్కన పెట్టేసి పగలబడి నవ్వుతుంటే అది చూసి ఆశ్చర్యపోవటం ఆయన వంతైందంట. ఓ కథగా 'జాతి రత్నాలు' గొప్ప సినిమా కాకపోవచ్చు... బట్ దాన్ని నడిపించిన విధానంతో సినిమా నిలబడిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ చిన్న సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంటే... 'లక్ష్మీ దేవి రా రా రా అంటూ పట్టుకున్నారా' అంటూ అలీ కామెడీ చేస్తే నవ్వేశారు అశ్వనీదత్. 


Also Read : మాచర్ల నియోజకవర్గం రివ్యూ : మరీ ఇంత రొటీనా - నితిన్ సినిమా ఎలా ఉందంటే?


ఓటీటీలో నెగటివ్ టాక్ 
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత 'జాతి రత్నాలు' సినిమాపై సోషల్ మీడియాలో చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాను థియేటర్లలో  చూసి జనాలు ఎందుకు అంతలా మెచ్చుకున్నారో ఏంటో అంటూ చాలా మంది రివ్యూలు రాశారు. బట్ 'జాతి రత్నాలు' సినిమా విడుదలైన పరిస్థితి వేరు. అప్పటి ప్రేక్షకుల స్టేట్ ఆఫ్ మైండ్ వేరు. కొవిడ్ భయంతో నవ్వటం మర్చిపోయి పూర్తిగా ఆందోళనలో ఉన్న టైంలో జాతిరత్నాలు విడుదలైంది. అచ్చం మన లైఫ్ లానే ఏమాత్రం లాజిక్ లేకుండా నడిచే ఆ సినిమాలో వచ్చే చిన్నపాటి కామెడీ సీన్లనే విపరీతంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. అదొక డిఫెరెంట్ పరిస్థితి... అదొక డిఫెరెంట్ సినిమా. మళ్లీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చు..అలాంటి సినిమా ఆడకపోవచ్చు. అందుకే నిర్మాతగా 50 ఏళ్ల ఎక్స్ పీరీయన్స్ ఉన్న అశ్వనీదత్ కు కూడా ఆ సినిమా విజయానికి కారణం అర్థం కాకనే ఇలాంటి కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో వివరణలు వినిపిస్తున్నాయి.


Also Read : కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?