Santosham Awards controversy: గోవాలో జరిగిన సంతోషం మూవీ అవార్డ్స్ (Santosham Awards) వివాదంపై అల్లు అరవింద్ స్పందించారు. ఆ అవార్డుల వేడుకను నిర్వహించిన సురేష్ కొండేటి.. మెగాస్టార్ కుటుంబానికి పీఆర్ అని పలు వార్తాసంస్థలు పేర్కోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ కుటుంబంలో ఎవరికీ ఆయన పీఆర్ కాదని స్పష్టం చేశారు. సంతోషం అవార్డ్స్ ఫెయిల్యూర్‌ను తమకు ఆపాదించవద్దని మీడియాను కోరుకున్నారు. 


ఏం జరిగింది?


మూవీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి (Suresh Kondeti) ఏటా ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్స్’ వేడుకలను నిర్వహిస్తున్నారు.  ఈ సారి అవార్డుల వేడుకను గోవాలో నిర్వహించారు. డిసెంబర్ 2న జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్‌కు కన్నడ సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే, నిర్వాహకులు ఈ వేడుకను నిర్వహించడంలో విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కన్నడ జర్నలిస్ట్ శారదా శ్రీనిధి ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కన్నడ స్టార్స్‌ను తీవ్రంగా అవమానించారని పేర్కొంది. కన్నడ సీనియర్ నటుడు రమేష్ అరవింద్ స్టేజి మీదకు వెళ్లగానే లైట్స్ ఆపేశారని, ఆ తర్వాత కన్నడ తారలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌కు తలనొప్పిగా మారింది. కన్నడ తారలను పిలిచి అవమానిస్తారా అంటూ టాలీవుడ్‌పై కన్నడ ప్రముఖులు, సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడుతున్నారు. కొన్ని వార్తా సంస్థలు మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సురేష్ కొండేటీ పీఆర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాయి. మెగాస్టార్ కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగుతున్నాయి. దీంతో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించక తప్పలేదు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 


మా కుటుంబంలో ఎవరికీ ఆయన పీఆర్వో కాదు


అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అవార్డుల ఫంక్షన్‌ను ఈ సారి గోవాలో నిర్వహించాడు. ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయ్యాడు, చేయలేకపోయాడు. అక్కడికి వెళ్లినవారు ఇబ్బంది పడ్డారు. అయితే, మీడియా మా కుంటుంబానికి చెందిన వ్యక్తులకు పీఆర్ఓ అని రాస్తున్నారు. దీంతో మా పీఆర్ఓకు కాల్ చేసి ఆయన పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పారా అని అడిగాను. ఎప్పుడైనా ఫొటోల కోసం, మరేదైనా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడు.. పీఆర్వో అని పేర్కోవడం కరెక్ట్ కాదు. అతను ఇండివిడ్యువల్‌గా ఏదో చేసుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. ఇతర భాషల వారికి కూడా ఇబ్బందులు కలిగాయి. వారు కూడా తెలుగు ఇండస్ట్రీని విమర్శిస్తున్నారు. అది ఒక వ్యక్తి చేసిన తప్పిదం. తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అంటూ వారు మాట్లాడాన్ని చూసి బాధపడ్డాను. ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో ఆపాదించడం మంచిది కాదు. ఆయన మాకుటుంబంలో ఎవరికీ పీఆర్ఓ కాదు. అది ఆయన పర్శనల్ ఫెయిల్యూర్. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదకు తీసుకురావద్దని కోరుతున్నా’’ అని తెలిపారు.


తెలుగు ఇండస్ట్రీలో జర్నలిస్ట్ సురేష్ కొండేటి గురించి తెలియనివారంటూ ఎవరూ లేరు. ఇప్పటికే పలు వివాదాలతో ఆయన పాపులర్ అయ్యారు. అయితే, అది ఇన్ని రోజులు టాలీవుడ్‌కే పరిమితమైంది. కానీ, గోవా ఈవెంట్‌తో ఇప్పుడు టాలీవుడ్ పరువు మొత్తం పోయిందంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు. మరి.. దీనిపై మన సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Read : 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం