Priyanka Arul Mohan: హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు స్వల్ప గాయాలు... తృటిలో తప్పిన ప్రమాదం, అసలు ఏమైందంటే?
Priyanka Mohan Injured: హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ గాయాపడ్డారు. ఆవిడ మహబూబాబాద్ వచ్చారు. అక్కడ గాయపడటంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన తమిళ అందాల భామలలో యంగ్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఆవిడకు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ వల్ల షాప్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు పిలుస్తారు. గురువారం అలా ఓ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రియాంకకు షాక్ తగిలింది. గాయాల పాలు అయ్యారు. అసలు ఏమైంది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజి!
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ ప్రాంతంలోని తొర్రూర్ మండంలోని ఓ క్లాత్ షోరూమ్ ఓపెనింగుకు ప్రియాంకా అరుల్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. షాప్ ఓపెనింగ్ పూర్తి అయ్యాక... ప్రజలకు అభివాదం చేయడానికి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజి ఎక్కారు ప్రియాంక. ఆ స్టేజి ఒక్కసారిగా కుప్ప కూలడంతో వేదిక మీద ఉన్న అందరూ ఉన్నట్టుండి కిందపడ్డారు.
Priyanka Arul Mohan Injured News: ప్రియాంక అరుల్ మోహన్‌తో పాటు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి తదితరులకు గాయాలు అయ్యాయి. స్టేజి కూలిన తర్వాత ప్రియాంకను ఒకరు ఎత్తుకుని కారులోకి తీసుకు వెళ్లడం మీడియా కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతానికి ఆవిడ ఆరోగ్యం బావుందని, స్టేజి కూలడం వల్ల చిన్న చిన్న గాయాలు కొన్ని అయ్యాయని, ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది. ఆమెకు తృటిలో ప్రమాదం తప్పిందని సమాచారం అందింది. ఝాన్సీ రెడ్డికి మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ సిటీలో ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
'సరిపోదా శనివారం'తో ప్రియాంకకు మరో హిట్
Priyanka Arul Mohan Upcoming Movies: ప్రియాంకా అరుల్ మోహన్ ఇటీవల 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. న్యాచురల్ స్టార్ నానికి జోడీగా ఆమె నటించిన రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా చేసిన సంగతి తెలిసిందే. 'సరిపోదా శనివారం' మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ'లో ఆమె నటిస్తున్నారు.
Also Read: నాగ చైతన్య, అక్కినేని నాగార్జునను అవమానించి సమంతకు సారీ చెప్పడం ఏమిటి? - లాజిక్ బయటకు తీసిన వర్మ
తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ యాక్ట్ చేసిన 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు భారీ విజయాలు అందించాయి. 'జయం' రవి జోడీగా ఆమె నటించిన 'బ్రదర్' సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.