Priyadarshi's Sarangapani Jathakam Movie Releases In Summer: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను ఈ సమ్మర్‌కు విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజ్ చేయాలని భావించినా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా, వేసవి సెలవుల్లో నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ 'సారంగో సారంగా', 'సంచారి సంచారీ' పాటలు ట్రెండ్ అవుతుండగా, టీజర్‌లోని డైలాగ్స్, కామెడీ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి (Indraganti Mohana Krishna), శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా 'సారంగపాణి జాతకం' రిలీజ్ అవుతోంది. 'వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి వెళ్లి చూడాల్సిన పరిపూర్ణ హాస్య రస చిత్రం మా 'సారంగపాణి జాతకం' అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. దర్శకుడు మోహనకృష్ణ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని.. ఇటీవల విడుదలైన టీజర్‌లో ప్రేక్షకులకు సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో పరిచయం చేశామని చెప్పారు. 'సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇస్తూనే ఇంటిల్లిపాదిని కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం కట్టిపడేస్తూనే, వచ్చే ఎండలకి సాంత్వనలా అందరినీ అలరిస్తుందీ సినిమా' అని అన్నారు.
Also Read: ఫోటో దిగుదామని మొహంపై కెమెరా పెట్టిన హీరో - ఫోన్ లాక్కొని జేబులేసుకునిపోయిన హీరో, వైరల్ వీడియో
జాతకాలను బాగా నమ్మే హీరో.. 'మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది' అనుకుంటాడు. ప్రతి రోజూ పేపర్‌లో చూసే జాతకాలు తన జీవితంలో నిజం అవుతాయని నమ్మి.. తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాడు. ఈ మూఢ నమ్మకాల వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.?. అనేదే సారంగపాణి జాతకం మూవీ కథాంశంగా ఉన్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. కమెడియన్‌గా సినీ కెరీర్ ప్రారంభించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియదర్శి. అనంతరం 'బలగం' సినిమాతో దూసుకెళ్లారు. ఆయన నటించిన మరో లేటెస్ట్ మూవీ 'కోర్టు.. స్టేట్ వర్సెస్ ఓ నోబడీ' సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ వాల్ పోస్టర్‍ను నేచురల్ స్టార్ నాని సమర్పించారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.
Also Read: తెలుగులోకి రొమాంటిక్ యూత్ వెబ్ సిరీస్ - ఆ ఓటీటీలోకి 'ఎమోజీ' స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?