Mazaka Trailer Talk: దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘ప్రస్థానం’తో నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన యంగ్ హీరో సందీప్ కిషన్, ఆ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు, చేస్తున్నాడు. కానీ, ఒక్కటి కూడా ఆయనని స్టార్‌‌ని చేయలేకపోయాయి. మధ్యమధ్యలో కొన్ని హిట్ వరకు వెళ్లినా, ఆ క్రెడిట్ కంటెంట్‌కి పోయింది తప్పితే, సందీప్‌కి స్టార్‌డమ్‌గా చెప్పుకునే పరిస్థితిని కల్పించలేదు. అయినా సరే, పట్టు వదలని విక్రమార్కుడిలా సందీప్ కిషన్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తూ చేస్తూ.. ఇప్పుడు 30వ సినిమా వరకు చేరుకున్నాడు. ఆయన హీరోగా, రావు రమేష్ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్ర ట్రైలర్‌ని ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి సందీప్ అనుకున్న హిట్, స్టార్‌డమ్ వచ్చేలానే అనిపిస్తుంది. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే..

‘‘నీలాంటి కొడుకు భూ మండలం మొత్తం వెదికినా దొరకడు రా..’’ అంటూ రావు రమేష్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా అనేలా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. సందీప్ కిషన్, రావు రమేష్ ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ నటించారనే విషయం, ట్రైలర్‌లో వారు కనిపించిన ప్రతి షాట్ తెలియజేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌, పంచ్ డైలాగ్‌తో సందీప్ కిషన్‌ ఎంట్రీ ఉంటే, వెంటనే ఆలస్యం చేయకుండా హీరోయిన్ రీతూ వర్మని సీన్‌లోకి తెచ్చేసి, పెగ్గు ఏశాక సిగ్గు ఎందుకు ఉంటుంది? మరో ప్రాస డైలాగ్. ఆ అమ్మాయిని పడేయాలంటే ‘మన్మథుడు’లా ఉండాలండీ అంటూ, ‘మన్మథుడు’ బ్యూటీ అన్షుని పరిచయం చేసిన తీరు, రావు రమేష్ కష్టాలు.. ఇవన్నీ కూడా హిలేరియస్‌గా అనిపిస్తున్నాయి.

Also Readచిరు, కమల్, బాలయ్యతో నటించిన హీరోయిన్... తాగుడుకు బానిసై కెరీర్ నాశనం... భర్తతోనూ గొడవలే, 44 ఏళ్ల వయసులో రెండో పెళ్లి

ఇంట్లో చెట్టంత కొడుకుని పెట్టుకని, ఆంటీలని పోయి గోకుతావా? అనే డైలాగ్‌తో ఈ సినిమా ఇతివృత్తం ఏంటో చెప్పేశారు. రీతూ వర్మ వెంట సందీప్ కిషన్ పడటం, తన కొడుకును ఫాలో అవుతూ రావు రమేష్ కూడా అన్షు వెంట పడటం వంటి సీన్లను ఫన్ జనరేట్ చేస్తూ తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంది. ఆ తర్వాతే అసలు కథలోకి తీసుకెళ్లారు. ఎవరూ ఊహించనటువంటి కొత్త ప్రాబ్లమ్ ఒకటి వచ్చింది అంటూ చూపించిన సన్నివేశాలన్నీ కథలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి. ‘సైకాలజీలో కోర్సులు ఉన్నాయిగానీ, సైకోలకు కోర్సులు అంటే సిలబస్ మీరే రాయాలి’ అంటూ మురళీ శర్మ రోల్‌ని, పోలీస్ ఆఫీసర్‌గా అజయ్.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ, ఎమోషన్‌లో ఫన్ మిక్స్ చేసి వీర లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఈ సినిమా అందించబోతుందనే హింట్‌ని ఈ ట్రైలర్‌తో ఇచ్చేశారు. కరోనా వైరస్, వ్యాక్సిన్.. శివరాత్రి, బాలయ్య బాబు ప్రసాదం.. అంటూ కామెడీని పండించిన తీరుతో ఈ ట్రైలర్ బాగా ఎంగేజ్ చేయడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కూడా సినిమాకు తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా అయితే ఈ ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా అనిపించడమే కాకుండా, హిట్ సినిమా కళని పరిచయం చేసిందని చెప్పుకోవచ్చు. కంటెంట్ పరంగా ఎటువంటి లోటు లేకుండా కనిపించిన ఈ ట్రైలర్, సినిమాగా ఏం చేస్తుందో చూడాలి. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారు. 

Also Readఏడుసార్లు అబార్షన్... బెదిరింపులు... తమిళ నటిపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు