''చైతన్య రావు (Chaitanya Rao) నాకు మంచి ఫ్రెండ్. హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు 'కీడా కోలా' వంటి సినిమాలు చేస్తూ సాటి నటుడిగా ఈర్ష్య పడేలా చేస్తున్నాడు'' అని ప్రియదర్శి అన్నారు. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ సహా హిట్ సినిమాలు చేసిన చైతన్య రావు హీరోగా నటించిన కొత్త సినిమా 'షరతులు వర్తిస్తాయి' (Sharathulu Varthisthai Movie). కుమార‌స్వామి (అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ పతాకంపై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం (మార్చి 15న) థియేటర్లలో విడుదల కానుంది. హీరో ప్రియదర్శి ముఖ్య అతిథిగా సోమవారం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 


సినిమాలో హీరో మిడిల్ క్లాస్ వారియర్!
ప్రియదర్శి మాట్లాడుతూ... ''ఈ సినిమాలో ప్రయోగాలన్నీ మధ్య తరగతి వారిపై జరుగుతుంటాయని డైలాగ్ ఉంది. మంచి ఫలితాలు కూడా మధ్య తరగతి నుంచే వస్తాయి. అందుకు నిదర్శనమే మీరంతా! మనం ఇవాళ తెరపై సూపర్ హీరోలు చాలా మందిని చూస్తున్నాం. 'షరతులు వరిస్తాయి'లో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నారు. మన గురించి చెప్పే ఇటువంటి చిత్రాలను థియేటర్లలో చూడండి. మంచి కథ రాసిన దర్శకుడు కుమార స్వామికి థ్యాంక్స్. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే నిజాయతీగా తెరకెక్కించారని అర్థం అవుతోందని, తనకు సాంగ్స్ & ట్రైలర్ నచ్చాయని ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ చెప్పారు.


Also Read: కేటీఆర్ మెచ్చిన 'షరతులు వర్తిస్తాయి' పాట - తెగువ చూపించేలా, స్ఫూర్తి నింపేలా!



మధ్య తరగతి జీవితాల్లో ఘటనలే ఈ సినిమా!
'షరతులు వర్తిస్తాయి' దర్శకుడు కుమారస్వామి తనకు పదేళ్లుగా తెలుసనీ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన 'నీదీ నాదీ ఒకే కథ', 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల చెప్పారు. ఆయన మాట్లాడుతూ... ''కుమారస్వామి సెలయేరులా స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలవాడు. 'మనల్ని చైనా వాడో, పాకిస్థాన్ వాడో మోసం చేయలేదు. మనం నమ్మిన స్నేహితులే మోసం చేశారు' అని డైలాగ్ రాశాడు. మన జీవితాల్లో జరిగే ఘటనల నేపథ్యంతో ఈ సినిమా రూపొందించాడు. ప్రపంచంలో తెలుగు వాళ్లందరూ రిలేట్ అయ్యే కథ. ఇటువంటి మంచి సినిమాలకు ఆదరణ దక్కాలి'' అని అన్నారు.


ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం!
'షరతులు వర్తిస్తాయి' మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇక్కడికి వచ్చామని హీరో చైతన్య రావ్ అన్నారు. ఇంకా మాట్లాడుతూ... ''మాకు మామిడి హరికృష్ణ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, వేణు ఊడుగుల అన్న ఎంతో సపోర్ట్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. మా ప్రయాణంలో గుర్తుండిపోయే చిత్రమిది. ఇటువంటి మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కుమారస్వామికి రుణపడి ఉంటా. నా పాత్రకు చిరంజీవి అనే పేరు పెట్టినప్పట్నుంచి భయం భక్తితో నటించా'' అని చెప్పారు.


ప్రేక్షకుల డబ్బు, సమయం వృథా కావు!
''కామన్ మ్యాన్ కథతో సినిమా చేస్తే కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసంతృప్తులు, అడ్డంపడే వాళ్లు, కడుపు మీద కొట్టేవాళ్లు ఉంటారు. వాళ్లందరూ బాగుండాలి. ఈ సవాళ్ల మధ్య మాకు సాయం చేసిన వారికీ థాంక్స్. మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని గతంలో రుజువైంది. ఈ సినిమా విషయంలో మాకు అదే నమ్మకం ఉంది'' అని దర్శకుడు కుమారస్వామి అన్నారు. ప్రేక్షకుల డబ్బు, సమయం వృథా కావని ఆయన చెప్పారు.


Also Read: లుంగీ కట్టి, గళ్ళ చొక్కా వేసి... హీరోగా రావు రమేష్ ఫస్ట్ లుక్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్!


''మేం ఓ మంచి ప్రయత్నం చేశాం. ఈ సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నా. నాతో పాటు నిర్మాణంలో భాగమైన నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా గారికి కంగ్రాట్స్. చాణక్యుడిని, చంద్రగుప్తుడిని కలిపితే ఎలా ఉంటుందో... అటువంటి క్యారెక్టర్ చైతన్య రావ్ చేశారు.  కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందీ సినిమా'' అని నిర్మాత డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శేఖర్ పోచంపల్లి, సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు, హీరోయిన్ భూమి శెట్టి తదితరులు పాల్గొన్నారు.