Prakash Raj Counter To Pawan Kalyan On Hindi Language Comments: జనసేన ఆవిర్భావ సభలో తమిళులపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ (Prakash Raj) తప్పుబట్టారు. హిందీ భాషను మాపై రుద్దొద్దంటే ఇంకో భాషను ద్వేషించడం కాదని.. మా మాతృభాషను కాపాడుకోవడం అని ట్వీట్ చేశారు. 'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి', అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.. స్వాభిమానంతో మా మాతృభాష, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి.. ప్లీజ్' అంటూ కౌంటర్ ఇచ్చారు.
'తమిళ సినిమాలు హిందీ డబ్ మానుకోండి'
దేశంలో అన్ని భాషలను గౌరవించాలని.. త్రిభాషా వాదన సరికాదని జనసేన ఆవిర్భావ సభలో పవన్ స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం అని.. దేశానికి బహు భాషలే కావాలని అన్నారు. 'తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా..? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు.
సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని చెబుతారు. సంస్కృతం దేవ భాష. హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్‌లో ఉంటాయి. కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకు..? భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటనలు చేస్తున్నవారు.. నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలి. అంతే కానీ రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏంటి.?. వివేకం, ఆలోచన ఉండొద్దా.?.' అని పవన్ నిలదీశారు. ఈ కామెంట్స్‌పై తమిళ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడొద్దు'
ఉత్తర దక్షిణ భారతదేశమని చర్చలు పెడుతూ.. ఉత్తరాది వాళ్లు తెల్లగా ఉంటారు. మేం దక్షిణాది వాళ్లం నల్లగా ఉంటామనే మాటలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడొద్దని పవన్ హితవు పలికారు. 'రాజకీయ వైరుధ్యాలు సహజం. ఆ నెపంతో దేశాన్ని ముక్కలు చెయ్యొద్దు. 14 ఏళ్ల వయసులో తమిళనాడులో పెరిగినప్పుడు నేనూ వివక్ష అనుభవించాను. తెలుగును రివర్స్‌లో గుల్టీ అంటూ అభ్యంతరకరంగా పిలిచేవారు. భాషను అడ్డం పెట్టుకుని విధ్వంసం చేయాలనే ఆలోచన సరికాదు' అని పవన్ పేర్కొన్నారు.
గతంలో పనవ్‌పై ప్రకాష్ రాజ్ విమర్శలు
అయితే, గతంలోనూ పవన్‌పై పలు సందర్భాల్లో ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తాజాగా.. హిందీ భాషపై పవన్ చేసిన వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు.