Pawan Kalyan About Kushi Song In Janasena Formation Day: తాను సమాజ హితం కోరే సినిమాలే చేసే వాడినని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దేశభక్తి పాట పెడితే మంచిదని ఆలోచించి 'ఖుషి' (Kushi) సినిమాలో 'యే మే రాజహా' పాట పెట్టానని.. ఓ మై డార్లింగ్ వంటి పాటలు పెట్టలేదని చెప్పారు. ఈ సినిమా చూసి అప్పట్లో ప్రజా గాయకుడు గద్దర్ తనను కలవడానికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 


'సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ వద్దు'


కోట్లాది మందిని ప్రభావితం చేసే సినిమా, రాజకీయ రంగాలు తనకు బాధ్యత ఇచ్చాయని పవన్ అన్నారు. ఈ క్రమంలో 'ఓజీ'.. 'ఓజీ' అంటూ అభిమానులు కేరింతలు కొట్టగా ఆయన స్పందించారు. సినిమాలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని.. మీరు 'ఓజీ' సినిమాకు వెళ్లి జనసేన జిందాబాద్ అని అనొద్దంటూ చెప్పారు. ఇక్కడ సినిమాల గురించి మాట్లాడకూడదన్నారు. ఇక్కడున్న చాలామంది ప్రాణాలకు తెగించినవారని.. 450 మంది జనసైనికులు సినిమాలు కాదు.. సిద్ధాంతాలు నమ్మి చనిపోయారని అన్నారు. 


Also Read: పవన్ ‘గబ్బర్‌సింగ్’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ to నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’, నిఖిల్ ‘కార్తికేయ’ వరకు - ఈ శనివారం (మార్చి 15) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్


'పవన్ నీ ప్రసంగానికి ఫిదా'.. మెగాస్టార్


మరోవైపు, ఆవిర్భావ సభలో పవన్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన తమ్ముడు పవన్ ప్రసంగానికి ఫిదా అయ్యానంటూ ప్రశంసించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. 'మై డియర్ బ్రదర్ పవన్ కల్యాణ్. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కు మంత్ర ముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్వఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా. జనసైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఉద్వేగంగా పవన్ ప్రసంగం 


మరోవైపు, జనసేన ఆవిర్భావ సభకు జనసైనికులు, పవన్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 11 ఏళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని పార్టీని ఎలా నిలబెట్టిందీ పవన్ తన ఉద్వేగ ప్రసంగంలో వివరించారు. తాను సినిమాలు, రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని.. కోట్లాది మందికి సంబంధించిన పాలిటిక్స్‌లోకి వచ్చానంటే అది దేవుడి దయేనని అన్నారు. తనను ఆదరిస్తోన్న నటీనటులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.






ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veeramallu) ఫస్ట్ పార్ట్ మే 9న రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తాజాగా ప్రకటించింది. ఈ మూవీ 2 భాగాలుగా వస్తుండగా.. తొలి భాగం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మూవీలో నిధి అగర్వాల్, బాబీ దేవోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.