ప్రభాస్ - రాజమౌళి (Prabhas - Rajamouli ), ఎన్టీఆర్ - రాజమౌళి (NTR Rajamouli) ... రెండూ సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్స్! ప్రభాస్ కంటే ముందు ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాలు చేశారు. అదీ వరుసగా రెండు చేశారు. అందులో ఒక సినిమా ప్రభాస్ చేయాల్సింది. అయితే... అది వదిలేసి ఎన్టీఆర్ దగ్గరకు రాజమౌళి రావడం వెనుక నందమూరి హరికృష్ణ ఉన్నారు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.


జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కలయికలో తొలి సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్'. ఇందులో హీరోగా ముందు ప్రభాస్‌ను అనుకున్నారట. ఆయన అయితే బావుంటుందని ఆలోచిస్తున్న సమయంలో హరికృష్ణ ఫోన్ చేయడంతో ఎన్టీఆర్‌ను తీసుకున్నామని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చామని చెప్పారు.        


ఎన్టీఆర్‌ను దైవంగా భావిస్తా
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) అంటే చలసాని అశ్వినీదత్‌ (Chalasani Ashwini Dutt) కు ఎంతో గౌరవం. ఎన్టీఆర్ 'ఎదురులేని మనిషి' సినిమాతో వైజయంతి మూవీస్ సంస్థ ప్రయాణం ప్రారంభం అయ్యింది. సంస్థ లోగోలో ఎన్టీఆర్ ఉంటారు. ఆ విషయమై అడగ్గా ''ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన్ను నేను దైవంగా భావిస్తా'' అని అశ్వినీదత్ చెప్పారు.


ఎన్టీఆర్ పాతికవేలు తిరిగిచ్చారు!
ఎన్టీఆర్ గొప్పదనం గురించి అశ్వినీదత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఎదురులేని మనిషి' సినిమాలో వాణిశ్రీ కథానాయికగా నటించారు. ఆవిడ రెండు లక్షల పారితోషికం కావాలని అడిగారట. ''ఆవిడకు రెండు లక్షలు కాబట్టి ఎన్టీఆర్ రెండున్నర లక్షలు అడుగుతారేమో అని ఒక కవరులో రూ. 50 వేలు తీసుకువెళ్ళా. 'ఏంటి 50 వేలు ఉంది? బ్యాలన్స్ 25 వేలే కదా! మనం తీసుకునేది రెండే' అని నాకు పాతికవేలు తిరిగి ఇచ్చారు'' అని గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.


ఎన్టీఆర్ పార్టీ అభిమానిగా ఉన్నాను తప్ప ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని అశ్వినీదత్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి ఆయన ఎప్పుడూ అభిమానిగా ఉన్నారు. పార్టీ కోసం ప్రచారం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైతం ప్రచారం చేస్తానని ఇటీవల 'సీతా రామం' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 


Also Read : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం
 
అదే ఆఖరి సినిమా అనుకుంటున్నాను
అశ్వినీదత్ నిర్మించిన సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రానిది ప్రత్యేక స్థానం. చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని కొన్నాళ్ళుగా అశ్వినీదత్ ప్రయత్నిస్తున్నారు. కానీ, ముందుకు కదలడం లేదు. ఆ సినిమా తన ఆఖరి సినిమా అనుకుంటున్నాని ఆయన తెలిపారు.


Also Read : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ