Khudiram Bose: 1889లో జన్మించిన ఖుదీరాం బోస్ స్వాతంత్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఈ యోధుడి గురించి చరిత్రకారులకు, చరిత్రను అభ్యసించే వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలుసు. ఈ నేపథ్యంలో ఖుదీరాం బోస్ టైటిల్‌తో ఓ సినిమా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి టైటిల్ పోస్టర్ గురువారం విడుదలైంది.


ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించనున్నారు. ఖుదీరాం బోస్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రజిత విజయ్ జాగర్లమూడి ఈ సినిమాకు నిర్మాత. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ‘‘ఇది చరిత్రలోకి ప్రవేశించిన పోరాటం, కానీ దాచిన రత్నం’’ అని మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను పరిచయం చేశారు. 


ఖుదీరాం బోస్ కోసం సూపర్ టీం


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శక నిర్మాతలు.  రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటన, సాంకేతిక ప్రతిభావంతుల కలయిక కనిపిస్తుంది. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కణల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ ఎపిక్ బయోపిక్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, డైలాగ్ రైటర్ బాలాదిత్య కూడా మూవీ టీంతో కలిశారు. ఈ సినిమా టైటిల్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు విడుదల చేశారు.


ఎవరీ ఖుదీరాం బోస్?


భారత స్వాతంత్ర్య సమరవీరుల్లో మొదటి తరానికి చెందిన అతిపిన్న వయస్కుడు ఖుదీరాం బోస్. బ్రిటీష్ అధికారిపై బాంబు వేసి సమర శంఖం పూరించిన వీరుడు. ఈ కేసులో అతడిని ఉరితీశారు. అయితే ఉరితీసే సమయానికి  ఆయన వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.


అది 1907 సంవత్సరం.. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు బ్రిటీష్ పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దానిని దూరం నుంచి చూస్తున్న ఓ యువకుడు.. ఆవేశం పట్టలేక ఓ అధికారిపై పిడిగుద్దులు కురిపించారు. ఆ ఘటన జరిగినప్పుడు అతడి వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అధికారిని కొట్టిన ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరు పరచగా.. ఆయనకు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి దెబ్బకు ‘వందేమాతరం’ అని నినదించారు. 


ప్రతీకార జ్వాల


తనకు శిక్ష విధించిన జడ్జి కింగ్ ఫోర్డ్‌కు గుణపాఠం చెప్పాలని ఆ యువకుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. తన స్నేహితుడితో కలిసి కింగ్ ఫోర్డ్ పై బాంబు వేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకం ప్రకారం, ముజఫర్ పూర్ వద్ద కింగ్ ఫోర్డ్ వాహనంపై బాంబు వేసి పారిపోయారు. కానీ ఆ వాహనంలో కింగ్ ఫోర్డ్ లేడన్న విషయం వారికి తర్వాత తెలిసింది. ఆ వాహనంలో కింగ్ ఫోర్డ్ భార్య పిల్లలు ఉన్నారు. తర్వాత వీరిద్దరూ పోలీసులకు చిక్కగా.. వారికి 1908 ఆగస్టు 11న ఉరిశిక్ష అమలు చేశారు. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం బోస్ మృత్యువును ఆహ్వానించారు.



Also Read: లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Also Read: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!