Prabhas praises Prithviraj Sukumaran: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’ చిత్రంతో వరద రాజమన్నార్‌ పాత్రలో నటించారు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆడుజీవితం’. ఈ సర్వైవల్‌ డ్రామాని ఇంగ్లీష్‌లో ‘ది గోట్‌ లైఫ్‌’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై డార్లింగ్ ప్రభాస్‌ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ పృథ్వీరాజ్‌ పై ప్రశంసలు కురిపించారు. 


‘‘బ్రదర్ పృథ్వీరాజ్.. నువ్వేం చేసావ్!! నేను చూస్తున్నది వరదరాజ మన్నార్‌ పాత్ర పోషించిన అదే వ్యక్తినేనా! నేను నమ్మలేకపోతున్నాను. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఇది బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది.’’ అని ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ పెట్టారు. దీనికి పృథ్వీరాజ్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘థాంక్యూ దేవా. త్వరలో శౌర్యాంగ పర్వం యుద్ధభూమిలో కలుద్దాం’’ అని రిప్లై ఇచ్చారు. 'సలార్' నటుల పోస్టుల స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ప్రభాస్ - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో 'రాధేశ్యామ్' సినిమా మలయాళ టీజర్ కు పృథ్వీరాజ్‌ వాయిస్ ఓవర్ అందించారు. ‘ది గోట్‌ లైఫ్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ని ప్రభాస్‌ విడుదల చేసి చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు. 'సలార్' మూవీ ప్రమోషన్స్ సమయంలో ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఇప్పుడు లేటెస్టుగా ‘ఆడుజీవితం’ ట్రైలర్ ను మెచ్చుకుంటూ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేసారు ప్రభాస్. త్వరలో వీరిద్దరూ కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం' సినిమాలో నటించనున్నారు. 


ఇకపోతే ‘ఆడుజీవితం’ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిం మేకర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్' నవల ఆధారంగా రూపొందించారు. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిస్థాయిలో ఎడారిలో తీసిన తొలి భారతీయ సినిమా. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీకి వెళ్లిన మలయాళీ వలస కూలీ జీవిత కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. పొట్టకూటి కోసం అరబ్ దేశాలకు వలస వెళ్లిన ఓ యువకుడు ఎన్ని కష్టాలు పడ్డాడు?, అక్కడ బానిస బతుకు నుంచి బయటపడేందుకు అతను ఎలాంటి సాహసాలు చేసారు? చివరికి అతను బ్రతికి బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 


'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) చిత్రంలో పృథ్వీరాజ్ కు జోడీగా అమలాపాల్ నటించింది. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చగా, రసూల్‌ పూకుట్టి సౌండ్‌ ఇంజినీర్‌గా వర్క్ చేసారు. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ శ్రీకర్ ప్రసాద్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం మార్చి 28న తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయనుంది. 


Also Read: లెజెండరీ నటుడికి వీరాభిమానిగా.. కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టిన కార్తి!