‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్... ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల విడుదల చాలా నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈసారి తప్పకుండా ఈ చిత్రాలు రిలీజ్ అవడం ఖాయమని అనుకుంటుండగా ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.


ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది కను ఆ సినిమా విడుదల విషయంలో ప్రభావం పడకపోవచ్చు. కానీ ‘సలార్’‌ సినిమా షూటింగ్ కు బ్రేక్‌ పడేలా ఉందని సమాచారం. గత నెలలో ప్రభాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రభాస్ ఆరోగ్యం గురించి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోసారి ప్రభాస్ అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతోంది.


ఇటీవల ఆసుపత్రికి వెళ్లిన ప్రభాస్‌ వైద్యుల సూచన మేరకు షూటింగ్స్‌ కి విరామం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలకు సంబంధించిన షెడ్యూల్స్‌ అన్నింటిని కూడా రద్దు చేశారట. ఈ విషయమై ప్రభాస్ టీం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


ప్రభాస్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనేందుకు చాలా సమయం తీసుకునే అవకాశాలున్నాయట. పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే ఆయన షూటింగ్‌లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే ఇప్పటికే విడుదల తేదీలు ఖరారైన 'ప్రాజెక్ట్‌ కే', 'సలార్' సినిమాల విడుదల వాయిదా అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయిన ఆ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని దర్శకుడు భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించనట్లుగా కనిపిస్తోంది. చికిత్స కోసం ప్రభాస్‌ విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. విదేశాల నుంచి ఆయన తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందని సమాచారం. ఈ ‘ఆదిపురుష్’‌ స్టార్‌ తిరిగి ఇండియాకు వచ్చే వరకు ఆయనతో సినిమాలు చేస్తున్న ఫిల్మ్‌ మేకర్స్ అంతా వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. 


సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కే’ సాధ్యమేనా


మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న 'ప్రాజెక్ట్‌ కే'ను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవలే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. కాగా ప్రభాస్‌ ఆరోగ్య సమస్యలు ఆ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం 'ప్రాజెక్ట్‌ కే' విషయంలోనే కాకుండా ఆయన నటిస్తున్న అన్ని సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశముంది. 


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్‌ చాలా సమయం కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ సినిమాలకు కూడా ఎక్కువ సమయం తీసుకున్నారు. కానీ ఇక నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించిన ప్రభాస్ కు కాలం కలిసి రావడం లేదనిపిస్తోంది. సౌత్‌ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.


Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా