ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మనోబాల కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మనోబాల మృతి అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగులో ఆయన చివరిగా.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటించారు. అందులో జడ్జి పాత్రలో కనిపించారు. అంతకు ముందు ఆయన ‘మహానటి’ సినిమాలో దర్శకుడు పి.పులయ్య పాత్రలో నటించారు.






మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబికులు తెలిపారు. అయితే, సమస్య తీవ్రం కావడంతో ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే, అప్పటికే మల్డీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ వల్ల ఆయన మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.


భారతీ రాజాకు కమల్ హాసన్ రిఫరెన్స్
మనోబాల నటుడు మాత్రమే కాదు... దర్శకుడు కూడా! అసలు, చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణమే దర్శకత్వ శాఖలో మొదలైంది. తమిళ దర్శకుడు భారతీ రాజాకు లోక నాయకుడు కమల్ హాసన్ రిఫరెన్స్ చేయడంతో 'పుతియా వార్పుగల్' చిత్రానికి సహాయ దర్శకత్వ శాఖలో మనోబాలను తీసుకున్నారు. అందులో ఓ చిన్న పాత్ర కూడా చేశారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం దిగ్విజయంగా సాగింది. 


మనోబాల సుమారు 700కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, మలయాళ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. తమిళ తెరపై ఆయన కనిపించిన చివరి సినిమా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఘోస్టీ'. తెలుగులో ఆ సినిమా 'కోస్టీ' పేరుతో అనువాదం అయ్యింది. తెలుగులో చివరి సారిగా 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కనిపించారు. అంతకు ముందు నాగార్జున, నాని హీరోలుగా నటించిన 'దేవదాస్'లో కానిస్టేబుల్ రోల్ చేశారు. 


విజయ్ 'లియో'లో మనోబాల!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'లియో' సినిమాలో కూడా మనోబాల ఉన్నారు. అధికారికంగా సినిమా ప్రారంభించడానికి ముందు ఆయన ట్వీట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన ట్వీట్ డిలీట్ చేయాల్సి వచ్చింది. 'లియో'లో మనోబాల పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ముగిసిందో? లేదో? ఇంకా తెలియలేదు. 


దర్శకుడిగా, నిర్మాతగా... 
సహాయ దర్శకుడిగా మనోబాల కెరీర్ మొదలైనప్పటికీ... తొలుత నటుడిగా ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తర్వాత మెగాఫోన్ పట్టారు. సుమారు 25 సినిమాలు డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమా 1982లో విడుదలైన 'ఆగాయా గంగై'. నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. మూడో సినిమా 'సతురంగ వెట్టై' విడుదలకు నోచుకోలేదు. 'ద లయన్ కింగ్'లో జాజు పాత్రకు తమిళంలో ఆయన డబ్బింగ్ చెప్పడం విశేషం. మూడు సీరియళ్లు కూడా చేశారు. ఆయన విభిన్న పాత్రలు పోషించినప్పటికీ... హ్యస్య నటుడిగా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 


మనోబాల మరణం పట్ల పలువురు చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప నటుడిని, మనిషిని కోల్పోయామని పేర్కొన్నారు. 


Also Read నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్