థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఓ హారర్ మూవీ. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు 'పిజ్జా 3'. మోహన్ గోవింద్ దర్శకత్వంలో అశ్విన్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్స్ లో విడుదలైంది. తమిళంలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 'పిజ్జా' అనే సినిమాకి ఇది పార్ట్ 3.


విజయ్ సేతుపతి హీరోగా 2012లో వచ్చిన 'పిజ్జా' సూపర్ హిట్ సొంతం చేసుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో విజయ్ సేతుపతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. పిజ్జా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత దానికి సిక్వెల్ గా 'పిజ్జా 2'( పిజ్జా ది విల్లా) అనే సినిమా వచ్చింది. దీపన్ చక్రవర్తి దర్శకత్వంలో అశోక్ సెల్వన్, సంచిత శెట్టి, నాజర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2013లో విడుదలై పర్వాలేదనిపించుకుంది. అయితే 'పిజ్జా 2' అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా 'పిజ్జా 3' సినిమా విడుదల చేశారు.


సుమారు 10 ఏళ్ల తర్వాత 'పిజ్జా 3' తెరకెక్కడం గమనార్హం. ఇటీవలే తమిళంలో విడుదలై హిట్ టాక్ అందుకున్న 'పిజ్జా 3' ని గతవారం థియేటర్స్లోకి విడుదల చేశారు నిర్మాతలు. ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.


సినిమాలో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, కథలో ఎమోషన్స్ ఆడియన్స్ ని కనెక్ట్ చేసినా, కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశపరిచింది. దీంతో ఈ చిత్రం రిలీజ్ అయి వారం కాకముందే ఓటిటిలోకి వచ్చేసింది. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా నిర్మాతలు సర్ప్రైజింగ్ గా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు. అది కూడా థియేటర్లో విడుదలై వారం రోజులు అవకముందే ఓటిటిలో రావడం గమనార్హం గా మారింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా 'పిజ్జా 3' స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 25 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


థియేటర్లో ఈ సినిమాని ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది చూసి ఎంజాయ్ చేయండి. కాగా కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి సంస్థ బ్యానర్ పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. గౌరవ్ నారాయణ్, అభిషేక్ శంకర్, కాళీ వెంకట్, అనుపమ కుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అశ్విని హేమంత్ సంగీతం అందించారు. సినిమాలో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని తిరు కుమార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సివి కుమార్ నిర్మించారు.


Also Read : ఓటీటీకి 'గాండీవదారి అర్జున’ - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial