మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'గాండీవ దారి అర్జున' శుక్రవారం ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నా.. అవుట్ డేటెడ్ స్టోరీ లైన్ తో డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీని తెరకెక్కించారంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ 'గాండీవదారి అర్జున' మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.


థియేటర్స్ లో విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వసూళ్లు రాకపోతే.. అంతకంటే ముందే వినాయక చవితికి విడుదలైన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ మూవీ తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో కూడా ఈ  స్ట్రీమింగ్ కానుంది. 


'గని' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా మేకింగ్ హాలీవుడ్ తరహాలో ఉండడంతో కచ్చితంగా వరుణ్ తేజ్ ఈ మూవీతో కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. అలాగే సినిమా కోసం వరుణ్ తేజ్ రోప్ షాట్స్, ఛేజింగ్ సీన్స్ లో గట్టిగానే కష్టపడ్డాడు. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ కి 'గాండీవదారి అర్జున' సినిమాతో మరోసారి నిరాశే మిగిలిందని చెప్పాలి.


ఇక 'గాండీవ దారి అర్జున' కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అర్జున్ అనే ఓ గూఢచారి పాత్రలో నటించాడు. సెంట్రల్ మినిస్టర్ ను చంపేందుకు కొందరు ఫారిన్ క్రిమినల్స్ ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆ ప్రయత్నాన్ని అర్జున్ ఎలా పసిగట్టాడు. వారి పన్నాగాన్ని ఎలా ఎదురుకున్నాడనేది యాక్షన్ అంశాలతో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. అలాగే సినిమాలో ఓ గ్లోబల్ ఇష్యూ గురించి కూడా డిస్కస్ చేశారు. సినిమాలో సీనియర్ నటుడు నాజర్ కీలక పాత్ర పోషించగా.. వినయ్ రాయ్, విమల రామన్, రోషిని ప్రకాష్, అభినవ్ గోమటం తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.


ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సతారు తన గత చిత్రం 'ది ఘోస్ట్' తో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అందుకోగా, ఇప్పుడు 'గాండీవ దారి అర్జున'తో మరోసారి ప్రేక్షకుల్ని నిరాశపరిచాడు.  కాగా వరుణ్ తేజ్ ప్రస్తుతం 'మట్కా' అనే సినిమా చేస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.


Also Read : కావాలంటే వారిని పిలుస్తా, జర్నలిస్టుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కౌంటర్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial